- పార్టీ పేరు మార్పుతో తెలంగాణ ప్రజలతో తెగిన పేగు బంధం
- జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనే కలలు కల్లలు
- పార్లమెంటు ఎన్నికల్లో బొక్క బోర్లా పడిన బీఆర్ఎస్
BRS, KCR: రాజకీయ చతురత ప్రదర్శించడంలో, ప్రత్యర్థుల అంచనాలకు భిన్నంగా వ్యవహరించడంలో, ఎంతటి రాజకీయ ఉద్ధండుడిని అయినా తేలికగా తీసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి! మాటకారితనం, ఎవరినైనా ఒప్పించే నేర్పరితనం, పరిస్థితులను ఆకళింపు చేసుకొని అందుకు తగినట్టుగా రాజకీయ చెడుగుడు ఆడటం ఆయన నైజం!! ఇదంతా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు తపన పడి, ఆరాట పడి, పోరాటం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురించిన వ్యక్తిత్వం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో అన్ని వర్గాల ప్రజలను ఏక తాటిపైకి తెచ్చిన కీర్తిలో సింహ భాగం ఆయనకే దక్కుతుంది. ఇందులో ఎలాంటి సందేహం ఎవరికీ లేదు. ఎట్టకేలకు 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయింది.
రాజకీయ పార్టీగా మార్పు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తదుపరి ‘చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన’ అని కేసీఆర్ (KCR) సగర్వంగా చెప్పుకున్నారు. స్వరాష్ట్రానికి తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని, తెలంగాణ తెచ్చిన తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీని(TRS) ప్రజలు గెలిపించారు. ప్రజల విశ్వాసం పొందే క్రమంలో మెదటి నాలుగేళ్లు సక్రమంగానే పాలన కొనసాగింది. ‘మాది రాజకీయ పార్టీ. మేము రాజకీయాలే చేస్తాము’ అని నిర్భీతిగా చెప్పడంతో తెలంగాణ రాష్ట్రం ప్రజల కోసం కాకుండా, రాజకీయ ఉద్దేశ్యాలతోనే తెచ్చుకున్నారా అనిపించేలా వ్యవహరించడం మొదలుపెట్టారు. రెండోసారి సైతం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తమ విశ్వరూపం చూపడం మొదలు పెట్టారు. ‘ఇందుగలడు అందుగలడు’ అన్నట్లు ఎక్కడ డబ్బుల కుప్పలకు అవకాశం ఉంటే అక్కడ వారి ప్రవేశం ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘దోచుకో దాచుకో’ అనే మాటకు కేసీఆర్ అండ్ ఫ్యామిలీ, ఆ పార్టీ నాయకులు సంపూర్ణ న్యాయం చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రం అప్పుల కుప్ప అయినా ఫర్లేదు కానీ, వారి ఖజానా కళకళ లాడేలా చూసుకున్నారు.
దేశంలో చక్రం తిప్పాలని
కేసీఆర్ చెప్పిందే వేదం! ఫ్యామిలీ మెంబర్స్ తప్ప మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజలు కలవడం అరుదుగా మారింది. అప్పటి ముఖ్యమంత్రి చుట్టూ సొంత కోటరీ ఉండేది. ప్రజా సమస్యలు ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజలను కలిసి బాగోగులు అడిగిన సందర్భాలు తక్కువే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఒకే రాష్ట్రానికి పరిమితం అయితే ఎలా? భారత దేశం లో చక్రం తిప్పాలంటే పార్టీ పేరు మార్చాలి. మేధోమధనం చేసిన భారత రాష్ట్ర సమితి (BRS)గా పేరు మార్చారు. తెలంగాణ డబ్బులు ఇతర రాష్ట్రాల్లో రైతులకు పంచి పెట్టారు. ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ‘తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది’ లాంటి నినాదాలతో పత్రికలు, టీవీల్లో ప్రచారం హోరెత్తించారు. అది కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ములతో.
అప్పుడు పవరు- ఇప్పుడు పరువు
రెండో సారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి, ఫోన్ ట్యాపింగ్, ప్రశ్నపత్రాల లీకులు, గొర్రెల స్కాం ఇలా అనేక అంశాల్లో అవకతవకలు బయటకు రావడంతో గత డిసెంబర్‌లో అధికారం కోల్పోయారు. చాలా మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్, బీజేపీల వైపు వలసలు వెళ్లడం మొదలు పెట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో 10-12 స్థానాలు గెలుస్తాము అంటూ కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ బస్సు యాత్రలు, కార్నర్ మీటింగులు, సభలు సమావేశాల్లో ఊదరగొట్టారు. ఈ నెల 4 వ తేదిన వెలువడిన పార్లమెంట్ ఫలితాల్లో అన్ని చోట్లా మూడో స్థానం (ఒక్క చోట రెండో స్థానం) పరిమితం అయింది. 17 స్థానాల్లో ఏడు చోట్ల డిపాజిట్ కూడా దక్కలేదు అంటే బీఆర్ఎస్ దయనీయ పరిస్థితి గమనించవచ్చు. అటు అసెంబ్లీ ఎన్నికల్లో పవరు పోయి, ఇటు పార్లమెంటు ఎన్నికల్లో పరువు పోయి ‘కిం కర్తవ్యం’ అనుకుంటూ తల్లడిల్లుతున్నారు!