PNG vs UGA Highlights, T20 World Cup 2024: ఉగాండా(Uganda), పపువా న్యూ గినియా (Papua New Guinea) మధ్య గయానా (Guyana)లో జరిగిన మ్యాచ్‌లో ఉగాండా మొదటి విజయం నమోదు చేసుకుంది. ఇరు జట్ల బౌలర్లు చెలరేగిన ఈ మ్యాచ్‌లో రెండు టీంలతో విజయం దోబుచులాడి ఉగాండానే విజయం వరించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఉగాండా, పపువా బ్యాటర్లపై ఆధిపత్యం చెలాయించింది. పపువా 0 పరుగుల వద్దే మొదటి వికెట్ కోల్పోగా, 19 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది.
వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ 77 పరుగులకు ఆలౌట్ కాగా, కేవలం ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు అందుకున్నారు. 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే అవుట్ కాగా.. పపువా న్యూ గినియా నాలుగు ఫోర్లు, ఒక సిక్సుతో ఇన్సింగ్‌ను ముగించింది. ఉగాండా బౌలర్లు సమష్టిగా రాణించి నలుగురు రెండేసి వికెట్లు తీయగా.. కెప్టెన్ మసాబా ఒక వికెట్ తీశాడు.
78 పరుగుల ఛేజింగ్‌తో బ్యాటింగ్‌కు దిగిన ఉగాండా ఓపెనర్లు 0,1, వనడౌన్ బ్యాటర్ 1 పరుగుకే పెవిలియన్‌కు చేరగా 6 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఎక్కడా కూడా ఉగాండా మ్యాచ్ గెలుస్తుందని ఎవరూ ఊహించలేరు. కానీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిజయాత్ అలీ షా (Ali Shah) కేవలం ఒక్క ఫోరు మాత్రమే బాది 33 పరుగులు చేసి ఉగాండాకు మరుపురాని విజయాన్ని అందించాడు. హీరో ఇన్సింగ్స్ ఆడిన అలీ షా కేవలం ఒక్క బౌండరీ మాత్రమే కొట్టాడు.
మిగతావన్నీ సింగిల్స్, డబుల్స్ రూపంలో రాబట్టి బౌలింగ్ పిచ్‌లో ఎలా ఆడాలో నేర్పించాడు. ఉగాండా బ్యాటర్లలో జిమా మియాగి (Jima Miyagi) 13 పరుగులతో అలీషాకు తోడుగా సాయమందించగా.. ఉగాండా ఉత్కంఠ భరిత పోరులో విజయం సాధిచింది. ఉగాండా 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 78 పరుగులను ఛేజ్ చేసింది. ఇందులో కేవలం రెండు ఫోర్లు మాత్రమే ఉండటం విశేషం.