- ఒక్క స్థానానికి అరడజను మంది పోటీ
- సెలక్టర్లకు తలనొప్పి
- అందరూ టీం ఇండియాకు ఆడిన వారే
T20 WORLD CUP, WICKET KEEPERS: ఒకప్పుడు టీం ఇండియా వికెట్ కీపర్లు లేక సతమతమవుతుండేది. బ్యాటింగ్ సరిగా చేయక టీం తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయేది. నయన్ మోంగియా, అజయ్ రాత్రా, సబా కరీం, ఎమ్మెస్కే ప్రసాద్ పార్థీవ్ పటేల్ లాంటి ప్లేయర్లను ట్రై చేసినా వారు అంతగా ప్రభావం చూపలేకపోయారు.
ఆ సమయంలో బీసీసీఐకి ఎట్టకేలకు ధోని రూపంలో సరైన మొనగాడు దొరికాడు. దీంతో ఎకంగా రెండు వరల్డ్ కప్‌లు సాధించిపెట్టాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ చేయడం అంటే అంత సులువు కాదు. వన్డేల్లో 50 ఓవర్లు నాన్ స్టాప్ కీపింగ్ చేసి మళ్లీ బ్యాటింగ్ చేయాలి. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ వికెట్ కీపర్ బ్యాటింగ్ బాగా చేయగలిగితేనే ఆల్ రౌండర్ ఉన్నా లేకున్నా.. బ్యాటింగ్ బలంతో మ్యాచ్‌లు గెలవొచ్చు.
వికెట్ కీపర్ కొరతను టీం ఇండియాకు ధోని తీర్చాడు. అయితే దోని స్ఫూర్తితో యువ క్రికెటర్లు వికెట్ కీపింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అదే కోవలో ఇప్పుడు వికెట్ కీపర్ బ్యాటర్‌గా దూసుకొస్తున్నారు. అయితే వీరి సెలెక్షన్ ఇప్పుడు సెలక్టర్లకు తలనొప్పిగా మారింది.
ప్రస్తుతం రాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం అర డజన్ మంది వికెట్ కీపర్లు ఒక్క స్థానం కోసం పోటీ పడుతున్నారు. సంజు శాంసన్, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, జితేశ్ శర్మ, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్ లాంటి వారు రేసులో ఉన్నారు. ఐపీఎల్‌లో ఎవరికి వారు మంచి పర్ఫామెన్స్ ఇచ్చేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరందరూ గతంలో టీం ఇండియాకు ఆడిన వారే కావడం గమనార్హం. టీం ఇండియాలో వికెట్ కీపింగ్‌కు ఇంత డిమాండ్ రావడం మంచిదే కానీ సెలక్టర్లకు మాత్రం పెద్ద తలనొప్పిగా మారింది. ఇదే స్థాయిలో బౌలింగ్, బ్యాటింగ్‌లో ముఖ్యంగా ఆల్ రౌండర్లను తీర్చిదిద్దాల్సిన సమయం ఆసన్నమైంది. మరి జూన్‌లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో చోటు సంపాదించే ఆ లక్కీ వికెట్ కీపర్ ఎవరో మరి.