- సత్తా చాటిన బ్యాటర్లు
- 223 పరుగులు చేసిన కేకేఆర్
- సునీల్ నరేన్ సెంచరీ
- ఆర్ఆర్ లక్ష్యం 224
IPL 2024 KKR vs RR: పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉన్న రజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య సాగిన మ్యాచ్ అభిమానులను అలరించింది. పూర్తి పైసా వసూల్ అన్నట్లు మ్యాచ్ సాగింది. కోల్‌కతా నైట్ రైడర్స్ హోంగ్రౌండ్‌లో పరుగుల వరద పారించారు. నరేన్ వీరవిహారం చేశాడు. కేవలం 56 బంతుల్లోనే 109 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్సులు, 13 ఫోర్లు ఉన్నాయి.
ఐపీఎల్ 2024 మ్యాచ్ నంబర్ 31 కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో మంగళవారం జరిగింది. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా భారీ స్కోర్ చేసింది. వికెట్ కీపర్ ఫిలిప్ సాల్ట్(10) తీవ్ర నిరాశ పరిచాడు. 21 పరుగుల వద్ద కోల్‌కతా మొదటి వికెట్ కోల్పోయింది. సునీల్ నరేన్, రఘువంశీ ఇద్దరూ కలిసి బ్యాటుకు పనిచెప్పారు. ఇద్దరూ 85 పరుగుల భాగస్వామాన్ని నెలకొల్పారు. 30 పరుగులు చేసిన రఘువంశీ 106 పరుగుల వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.
తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్(11) పెద్ద పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. 133 పరుగుల వద్ద మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. తరువాత రస్సెల్ (13) సైతం పెద్దగా పరుగులు చేయలేదు. 184 పరుగుల వద్ద నాలుగో వికెట్ వెనుదిరిగాడు. 109 పరుగులు చేసిన సునీల్ నరేన్ బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కోల్‌కతా 17.3 ఓవర్లలో 195 పరుగుల వద్ద ఐదో వికెట్ నష్టపోయింది. ఆరో వికెట్‌గా వెంకటేశ్ అయ్యర్ (8) ఔట్ అయ్యాడు. రింకూసింగ్, రమణ్ దీప్ సింగ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా 223 పరుగులు చేసింది.