- రుణమాఫీలో ప్రభుత్వం విఫలం
- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
Ex Minister Koppula Eshwar: పెద్దపల్లి, అక్టోబర్ 1 (మన బలగం): అప్పుడు ఓట్లేసి కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలు ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా రుణమాఫీ కావలసిన రైతుల సంఖ్య 1 లక్ష 52 వేల 184 ఉండగా, ఇంకా 51,393 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల మందికిగాను 23 లక్షల 25 వేల మందికి ఇచ్చారని, మిగిలిన రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఒక్క స్కీం అయినా సరిగా అమలు కాలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 23 సార్లు ఢిల్లీ పోయి వచ్చిండని, ఈ రోజు సైతం ఢిల్లీలోనే ఉన్నాడని, ఏం సాధించిండో తెలియదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రెసిడెన్షియల్ హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ పాల్గొన్నారు.