- ఎత్తిన ప్రాజెక్టుల ఫ్లడ్ గేట్లు
- గోదావరికి పోటెత్తిన వరద
- పొంగిన వాగులు,వంకలు
Incessant rain.. reservoirs filled: నిర్మల్, ఆగస్టు 18 (మన బలగం): మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాతో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డన్న వాగు ప్రాజెక్టుల తో పాటు పొరుగు జిల్లా నిజామాబాద్‌లోని శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుండి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్ట్‌ల పూర్తి స్థాయి సామర్ధ్యానికి చేరుకున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు వరద ఉధృతిని అంచనా వేస్తూ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
కడెం ప్రాజెక్టు
కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ఎగువ నుంచి 30 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 6ఫ్లడ్ గేట్లు ఎత్తి 34వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రాత్రి వరకు ఇన్‌ఫ్లో పెరిగినట్లయితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు సమాచారం.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1089.3 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. ఎగువ నుండి ఒక లక్ష 25 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది ప్రాజెక్టు 34 ఫ్లడ్ గేట్లను ఎత్తి 1లక్షా30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
స్వర్ణ, గడ్డన్న వాగు ప్రాజెక్ట్
జిల్లాలోని స్వర్ణ, గడ్డన్న వాగు ప్రాజెక్టులలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమై అధికంగా వస్తున్న నీటిని ఫ్లడ్ గేట్ల ద్వారా గోదావరిలోకి వదులుతున్నారు.
గోదావరికి పోటెత్తిన వరద
జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డన్న వాగు ప్రాజెక్టులతో పాటు నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఫ్లడ్ గేట్లు
ఎత్తడంతో గోదావరికి వరద పోటెత్తింది. గోదావరి ప్రమాద హెచ్చరికలు దాటి ప్రవహిస్తోంది. ఏకకాలంలో అన్ని ప్రాజెక్టులు నీటిని వదలడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.
