Bhumi Puja: జగిత్యాల ప్రతినిధి, జనవరి 18 (మన బలగం): జగిత్యాల పట్టణం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, వస్తున్న నిధులతో అభివృద్ధి పనులను చేపడుతున్నామని జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో 13, 43వ వార్డుల్లో రూ.20 లక్షలతో వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ పట్టణంలో యేండ్ల క్రితం వేసిన రహదారులన్నీ గుంతలమయంగా మారాయని అన్నారు. అభివృద్ధిలో పనుల్లో భాగంగా ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే రహదారులు, డ్రైనేజీల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. పట్టణంలో ఒక్కో వార్డులో ఇప్పటికే రూ.కోటికి పైగా నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రజలు ఇళ్ల నిర్మాణం చేపట్టే ముందు లే అవుట్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని కోరారు. అమృత్ పథకంలో భాగంగా ఇంటింటికీ మంచినీరు అందించడం కోసం పనులు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ చిరంజీవి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు ఆసియా సుల్తానా-కమల్, ఫిర్దూస్ బేగం-నదీమ్, ఏఈ శరణ్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, వార్డు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు ఉన్నారు.