Protest against ethanol factory
Protest against ethanol factory

Protest against ethanol factory: పురుగు మందు డబ్బాలు చేతబట్టకొని మహిళల రాస్తారోకో

  • నిర్మల్ – భైంసా రహదారిపై రాస్తారోకో
  • ఉదయం 7 గంటల నుంచి కొనసాగింపు
  • రోడ్డు పైనే వంటా వార్పు
  • నాయకులు కనిపించడంలేని ఫ్లెక్సీల ప్రదర్శన

Protest against ethanol factory: నిర్మల్, నవంబర్ 26 (మన బలగం): నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండల కేంద్రంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమంలో భాగంగా మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ రాస్తారోకో సాయంత్రం దాకా కొనసాగుతూనే ఉంది. తెల్లవారుజామునే మహిళలు, పురుషులు చేతుల్లో పురుగు మందు డబ్బాలలో రాస్తారోకో చేపట్టారు. దిలావర్‌పూర్ – గుండంపల్లి మధ్య ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపివేయాలని డిమాండ్ చేస్తూ భైంసా – నిర్మల్ రహదారిపై నిర్వహించిన ఈ ధర్నాతో రోడ్డుపై వందలాది వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఫలితంగా పోలీసు శాఖ గొల్లమాడ, బీరవెల్లి మీదుగా రాకపోకలను కొనసాగించారు. నిరసనలో భాగంగా మంగళవారం మండల బంద్‌కు పిలుపునిచ్చారు. ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా వినకపోగా తమ రాస్తారోకో కొనసాగిస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం ఆపే దాకా తమ నిరసనలు కొనసాగిస్తామని వారంటున్నారు. దీంతో ఫ్యాక్టరీ వైపు వెళ్లే మార్గం పోలీసు దిగ్బంధంలోకి వెళ్లింది. నిరసనకారులకు నచ్చజెప్పేందుకు నిర్మల్ ఆర్డీవో రత్నకళ్యాణి వెళ్లారు. ఆమెను మహిళలు ఘెరావ్ చేసి నిరసన వ్యక్తం చేశారు. నెలరోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తూ తమ వ్యతిరేకత చాటుతున్నా ప్రజాప్రతినిధులు తమ గోడును పట్టించుకోనందుకు నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంఎల్ఏ మహేశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు కనిపించటం లేదంటూ వారి ప్లకార్డులు చేత పట్టుకొని నిరసన వెలిబుచ్చారు. రోడ్డుపైనే వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. జాతీయ రహదారిపైనే భోజనాలు చేసి తమ నిరసనను తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని విరమించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Protest against ethanol factory
Protest against ethanol factory

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *