cyber frauds: మల్యాల, ఏప్రిల్ 10 (మన బలగం): రోజు రోజుకూ పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని జిల్లా లీడ్ బ్యాంక్ ఎఫ్ఎల్సీ కోట మధుసూదన్ అన్నారు. మండల పరిధిలోని గుడిపేట గ్రామంలో జిల్లా లీడ్ బ్యాంక్ కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజులకు ఎవరూ స్పందించవద్దని, తమ వ్యక్తిగత వివరాలు, ఓటీపీ లాంటివి ఎవరికీ చెప్పవద్దని సూచించారు. పొరపాటున ఎవరైనా సైబర్ మోసాల ద్వారా డబ్బులు కోల్పోయినట్లు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వాలని తెలిపారు. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండి, బ్యాంక్ ఖాతా కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలైన ప్రధాన మంత్రి జీవనజ్యోతి యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలైన అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన మొదలగు పథకాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వీవోఏ సాత్విక, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.