Chada Venkata Reddy: నగరంలో సీపీఐ ఎదుగుదల కోసం ప్రతి ఒక్క కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ కరీంనగర్ నగర 11వ మహాసభ సందర్భంగా పార్టీ కార్యాలయం ఎదుట పార్టీ పతాకాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఆవిష్కరించారు. నగర కార్యదర్శి రిపోర్ట్‌ను నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం ఏర్పాటుచేసిన మహా సభలో చాడ వెంకటరెడ్డి ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఎర్రజెండా అంటే దోపిడీదారులు, పేదలను అణిచివేసేవారికి గుండెల్లో రైళ్లు పరిగెడతాయని పేర్కొన్నారు. సీపీఐ మార్క్సిజమ్ లెనిజం పునాదులపై ఆవిర్భవించిందని, అంతరాలు లేని సమాజ స్థాపన కోసం నిర్విరామ పోరాటం చేసిందని గుర్తుచేశారు. భూమిలేని నిరుపేదలకు భూమి కావాలని ఇండ్ల స్థలాల కోసం, రేషన్ కార్డుల కోసం అనేక పోరాటాలు చేసిన ఘన చరిత్ర సీపీఐకి ఉందన్నారు. కరీంనగర్ నగరంలో అనేక భూ పోరాటాలు చేసి వేలాది మందికి ఇండ్లు ఇప్పించిన చరిత్ర సీపీఐదని, చింతకుంట, రేకుర్తి, బద్దిపల్లి గ్రామాల్లో ఎంతోమంది నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించడంలో సీపీఐ క్రియాశీలకపాత్ర వహించిందని తెలిపారు. నాటి పోరాట పటిమను పునికి పుచ్చుకొని రానున్న కాలంలో పేదలకు ఇండ్లు దక్కేంతవరకు పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కరీంనగర్ నగరంలో ప్రభుత్వ భూమిలన్నీ కొందరు రాజకీయ నేతలు, కార్పొరేటర్ల కనుసన్నల్లో ఉన్నాయని, వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బయటికి తీసి పేదలకు పంచేందుకు కార్యకర్తలు ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. కరీంనగర్ నగరంలో జరిగిన స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి రాజ్యమేలిందని, అవినీతిపై పాలక ప్రభుత్వాలు నోరు మెదకపోవడం సిగ్గుచేటని అన్నారు. తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్‌లలో కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని, పాలకవర్గం పూర్తిగా దోపిడీ చేసిందని దీనిపై కాంగ్రెస్ పార్టీ సీబీఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు. అన్ని డివిజన్లలో పార్టీ ప్రజాసంఘాల విస్తరణకై ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని అన్నారు. కూడు, గూడు, నీడ, వైద్యం, విద్య అందరికీ అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు. దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదాయం అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్లు దోచిపెడుతుందని ఒకవైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ మోడీ ప్రభుత్వం అరాచక వ్యవస్థ నడిపిస్తోందన్నారు. స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2026 లో నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పడం చూస్తుంటే ప్రజాస్వామ్యంపై వారికి ఏ విధమైన నమ్మకాలు ఉన్నాయో అర్థం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కార్యకర్తలు సమర శంఖం పూరించాలని అన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర గల పార్టీ ఈ దేశంలో ఒక సీపీఐ మాత్రమేనని ఆయన తెలిపారు. దేశంలో 11 సంవత్సరాలుగా మోడీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి కుల, మత వ్యవస్థను పెంచి పోషిస్తున్నారని, దేశంలో అనేక మంది నాయకులు రక్త తర్పణంతో చట్టాలు తీసుకువస్తే వాటిని మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. రాబోయే కాలంలో పేద ప్రజలకు అండగా సీపీఐ కార్యకర్తలు నిలవాలని, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసిందని, అన్ని వ్యవస్థలు అవినీతి దోపిడీ పెరిగి పోయిందని అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ప్రజలు ఎన్నుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చిందని వెంటనే వాటిని అమలు పరిచేందుకు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు పరచకుంటే రానున్న కాలంలో ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. నగరంలో అసైన్డ్, పరంపోగు, శిఖం భూములు కొంతమంది రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఉన్నాయని, వీటిని ప్రభుత్వం వెంటనే స్వాధీన పరుచుకోవాలని కోరారు.
సీపీఐ కరీంనగర్ నగర 11వ మహాసభకు న్యాలపట్ల రాజు, బీర్ల పద్మ అధ్యక్షత వహించారు. సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కిన్నెర మల్లమ్మ, కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, పంజాల శ్రీనివాస్, నలువాల సదానందం,సాయవేణి రాయమల్లు, శారద, బోనగిరి మహేందర్ నగర కార్యవర్గ సభ్యులు గామినేని సత్యం, కొట్టే అంజలి, ఎలిశెట్టి భారతి, కళ్యాణపు రేఖ, సత్యనారాయణ చారి, సాంబరాజు, తంగేళ సంపత్, నగునూరి రమేష్, ఓరుసు కొమురయ్య, భూక్య లక్ష్మి, సాధవేని బాలయ్య, కాళిదాస్, ఎర్రం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.