మాజీ మంత్రి కేటీఆర్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి హాజరు
Inauguration of Mahankali Temple: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 7 (మన బలగం): ఆశేష భక్తుల నడుమ, వేదమంత్రాలతో గంభీరావుపేట మండలం కేంద్రంలో రెడ్డి సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ గణపతి ధ్వజయుక్త శ్రీ మహంకాళి అమ్మవారి మూల విరాట్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గణపతి సహిత ధ్వజయుక్త మహాకాళి దేవి యంత్రమూర్తిస్థాపనం, శిఖర ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, కళాన్యాసం పూజ, దిక్పాలక బలి, నేత్రోన్మిలనం, మహా పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం, ప్రతిష్టమూర్తులకు మహా పూజ హారతి ఆశీర్వచనం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం, సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్స హన్మాండ్లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సేవాసంక్షేమ సంఘం సభ్యులు, గ్రామ ప్రజల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.