Nirmal Hospitals
Nirmal Hospitals

Nirmal Hospitals: నిర్మల్‌లో హాస్పిటల్స్ నయా దందా

  • వ్యాపారుల చేతుల్లో ఆస్పత్రులు
  • అనర్హులతో వైద్య సేవలు
  • గాలిలో దీపంలా ప్రాణాలు
  • రూ.లక్షల్లో బిల్లులు
  • ద్యం చూస్తున్న అధికారులు
  • దాడుల్లో వెలుగు చూస్తున్న నిజాలు

Nirmal Hospitals: నాడు వైద్యులను దేవుళ్లతో సమానంగా భావించేవారు… కానీ నేడు వైద్యం పెద్ద వ్యాపారంగా తయారైంది… శవాలకు వైద్యం చేసి డబ్బులు వసూలు చేసే ఆస్పత్రులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇవన్నీ ఎక్కడో పట్టణ ప్రాంతాల్లో జరిగితే వినేవాళ్లం. కానీ నేడు ఈ సంస్కృతి సాధారణ పట్టణాలకు గ్రామాలకు సైతం సోకింది. నిర్మల్ పట్టణంలో కూడా కొందరు శంకర్ దాదా ఎంబీబీఎస్‌లు ఆస్పత్రులను కొనసాగిస్తున్నారని ఇటీవల మెడికల్ కౌన్సిల్ అధికారులు జరిపిన తనిఖీల్లో వెలుగు చూసింది. పట్టణంలో కొందరు ఉద్యోగులు, వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టి ఆస్పత్రులను నిర్వహిస్తున్నారు. కన్సల్టెంట్ వైద్యులతో ఆస్పత్రులను నడిపిస్తూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. వైద్యంలో వ్యాపారులు అడుగుపెట్టడంతో ఈ సంస్కృతి తలెత్తింది. గతంలో వైద్య విద్యను అభ్యసించిన వారే ఆస్పత్రులను ఏర్పాటు చేసుకొని నడిపించేవారు. కానీ నేడు వైద్య విద్య చేసిన వారికి వేతనాలు ఇస్తూ వ్యాపారులు ఆస్పత్రులను నడిపిస్తున్నారు. దీంతో ఏదేని జబ్బుతో ఆస్పత్రికి వచ్చిన వారి జేబులకు చిల్లులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. అనవసరపు టెస్టులు, ఎక్స్‌రేలు, స్కానింగులు అంటూ రూ.వేలల్లో టెస్టులు, రూ.లక్షల్లో ఆస్పత్రి బిల్లులు వేస్తూ దోచుకుంటున్నారు.
అనర్హులతో వైద్యం
వ్యాపారులు ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో నామమాత్రంగా ఒకరు వైద్య విద్యను అభ్యసించిన వారు ఉండగా మిగతావారు అంతా శంకర్ దాదా ఎంబీఎస్‌లే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆస్పత్రికి అనారోగ్యంతో వచ్చిన రోగులకు వైద్యుడు పరీక్షించిన అనంతరం మిగతా వైద్య సేవలు అన్నీ అనర్హుల చేతనే చేయిస్తారు. చిన్న జబ్బుతో ఆస్పత్రికి వచ్చినా అనవసరపు టెస్టులు చేయించి రోగిని భయభ్రాంతులకు గురిచేసి ఆస్పత్రిలో చేర్చుకుంటున్నారు. అనర్హులతో వైద్యం చేయించడం వల్ల వైద్యం వికటించి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. ఆస్పత్రిలో కాంపౌండర్లు, నర్సులు శిక్షణ పొందిన వారు ఉండాల్సి ఉంది. కానీ అవేమీ పట్టించుకోకుండా ఎలాంటి అనుభవం లేని వారిని తక్కువ వేతనానికి ఉంచుకొని వైద్యం చేయిస్తున్నారు. దీంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మృతుల కుటుంబీకులు ఆందోళన చేస్తే ఎంతో కొంత ముట్టజెప్పి శాంతింప చేయడం ఇక్కడ ఆనవాయితీగా మారింది.

మెడికల్ కౌన్సిల్ దాడులతో వెలుగులోకి
ఇటీవల నిర్మల్ పట్టణంలో పలు ఆస్పత్రులపై మెడికల్ కౌన్సిల్ అధికారులు జరిపిన దాడులతో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూశాయి. అనర్హులతో ఆస్పత్రుల నిర్వహణ, అనర్హులు వైద్యం చేయడం తదితర అంశాలు వెలుగు చూశాయి. పట్టణంలో కొన్ని ఆస్పత్రుల్లో జరుగుతున్న లోపాలను అధికారులు వేలెత్తి చూపించారు. పలు ఆస్పత్రులపై కేసులను నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా కొందరు ఆర్ఎంపీ వైద్యులు సైతం అనర్హులు ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది. వారిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. అయితే పట్టణంలో కేసులు నమోదు చేసిన ఆస్పత్రులు తిరిగి యథావిధిగా కొనసాగడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

అధికారుల కనుసన్నల్లోనే
జిల్లా కేంద్రమైన నిర్మల్ పట్టణంలో అక్రమంగా ఆస్పత్రులు నడుస్తున్నప్పటికీ జిల్లా స్థాయి అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ ఆస్పత్రుల వ్యవహారం నడుస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. వైద్య శాఖలో పనిచేసే కొందరు ప్రైవేటుగా ఆస్పత్రులను ఏర్పాటు చేసుకొని కొనసాగించడం వల్లే అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆస్పత్రులు ఎవరైనా పెట్టుకోవచ్చు
వైద్య విద్యను చదివిన వారే ఆస్పత్రి పెట్టుకోవాలన్న నిబంధనలు ఏమీ లేవు. ఆస్పత్రులు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఆస్పత్రి ఎవరు ఏర్పాటు చేసినా వైద్యుడు మాత్రమే వైద్యం చేయాలి. ఇటీవల నిర్మల్ పట్టణంలో మెడికల్ కౌన్సిల్ అధికారులు జరిపిన దాడులతో మాకు ఎలాంటి సంబంధం లేదు. దానికి సంబంధించి ఎలాంటి సమాచారం మాకు లేదు. మేము సైతం రెగ్యులర్‌గా ఆస్పత్రులను తనిఖీలు చేస్తున్నాం. తనిఖీల్లో ఎలాంటి లోటుపాట్లు ఇంతవరకు బయటపడు.

జిల్లా వైద్యాధికారి ధనరాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *