Nirmal Collector: నిర్మల్, జనవరి 21 (మన బలగం): గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శాఖల వారీగా చేపట్టవలసిన పనులను అధికారులకు వివరించారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో పరేడ్ నిర్వహణకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్‌ను ఏర్పాటు చేయాలని తెలిపారు. దేశభక్తిని ప్రతిబింబించేలా విద్యార్థులచే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలోని స్వాతంత్ర్య సమరయోధులను, ప్రముఖులను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించాలన్నారు. పలు శాఖల ఆధ్వర్యంలో శకటాలు, స్టాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్కింగ్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. కార్యక్రమం జరుగుతున్నంత సేపు విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సభా వేదిక సమీపంలో అంబులెన్స్, అత్యవసర మందులు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులకు, అధికారులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్ కిషోర్ కుమార్, అదనపు ఎస్పీ ఉపేంద్రా రెడ్డి, నిర్మల్, భైంసా ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.