Rice millers: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ఈ నెల 15వ తేదీలోగా పెండింగ్ సీఎంఆర్ ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఖరీఫ్, రబీ 2023-2024 సీజన్ సీఎంఆర్ ఇవ్వడం, ఖరీఫ్ 2024-2025 సీజన్ ధాన్యానికి సంబంధించి బ్యాంక్ గ్యారంటీ అందజేయడంపై జిల్లాలోని బాయిల్డ్, రా రైస్ మిల్లర్లతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్‌తో కలిసి మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని కొందరు బాయిల్డ్, రా రైస్ మిల్లర్ల నుంచి గత ఖరీఫ్, రబీ 2023-2024 సీజన్ సీఎంఆర్ ఇంకా పెండింగ్ ఉందని తెలిపారు. ఆయా రైస్ మిల్లర్లు ఈ నెల 15వ తేదీలోగా ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పెంచమని తెలిపారు. ఖరీఫ్ 2024-2025 సీజన్ ధాన్యాన్ని తమ మిల్లుల్లో దించుకున్న యజమానులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలని ఆదేశించారు. ఏ ఏ రైస్ మిల్ యజమాని ఎంత ఇవ్వాలో అధికారులు తెలిపారు. జిల్లా పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ రజిత, బాయిల్డ్, రా రైస్ మిల్లర్లు, అధికారులు పాల్గొన్నారు.