- వారాంతాల్లో ఉండని డాక్టర్లు
- నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇదీ పరిస్థితి
Child Death Due to Lack of Doctors in Nirmal: నిర్మల్, ఆగస్టు 18 (మన బలగం): ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ తక్షణ వైద్య సహాయం అందించే గ్రామీణ వైద్యులపై ఆంక్షలు విధిస్తున్నారు. వారిపై ఆంక్షలు విధించడం పట్ల గ్రామీణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వీకెండ్‌లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. 24 గంటలు అందుబాటులో ఉంటామని, ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని ప్రతిసారి చెప్పుకునే వైద్యులు శనివారం వచ్చిందంటే చాలు పట్టణాలకు పరుగులు పెడతారు. శనివారం, ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏ ఆసుపత్రిలోనూ ఒక్క వైద్యులు అందుబాటులో ఉండరు. ఏదైనా అత్యవసరం అవసరం వస్తే చావాల్సిందే. ఇది నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైద్యరంగ పరిస్థితి.
నిర్మల్ పట్టణం దివ్య నగర్‌లో అద్దెకు ఉంటున్న పార్పెల్లి గ్రామానికి చెందిన కాపుల హరీశ్ మేడిపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన కూతురు హర్షాలి నిర్మల్ పట్టణంలోని విన్నర్స్ ఒలంపియాడ్ పాఠశాలలో నర్సరీ చదువుతోంది. ఆదివారం సాయంత్రం జ్వరం వచ్చింది. దీంతో పట్టణంలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులకు తిరిగారు. ఎక్కడా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో జ్వరానికి సంబంధించిన సిరప్ వేసి పడుకోబెట్టారు. మధ్య రాత్రి జ్వరం తీవ్రం కావడంతో పాటు ఫిట్స్ వచ్చాయి. మళ్లీ అన్ని ఆసుపత్రులకు పాపను తీసుకొని వెళ్లారు. ఎక్కడ వైద్యులు అందుబాటులో లేరు. దీంతో తెలిసిన వారి ద్వారా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యురాలిని సంప్రదించగా అప్పటికే చాలా ఆలస్యమైందని, పాప అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. వైద్యులు అందుబాటులో ఉండి ఉంటే తమ పాప బతికేదని చిన్నారి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
చిన్నారి మృతి బాధాకరం
నిర్మల్ పట్టణంలోని విన్నర్ ఒలంపియాడ్ పాఠశాలలో నర్సరీ చదువుతున్న చిన్నారి హర్షాలి మృతి చెందడం బాధాకరమని పాఠశాల యాజమాన్యం సంతాపం ప్రకటించింది. రాత్రి తీవ్రమైన జ్వరంతో మృతిచెందిన దుర్వార్తను తెలియజేయడం బాధాకరం. ఈ విషాద సమయంలో హర్షాలి కుటుంబానికి మా పాఠశాల తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.హర్షాలి మృతికి నివాళిగా సోమవారం స్ప్రౌట్స్ క్యాంపస్, ఫ్లోరా క్యాంపస్లకు సెలవు ప్రకటిస్తూ,చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు.