విద్యార్థి మృతి ఘటనపై కలెక్టర్ సీరియస్
Suspension of four employees: నిర్మల్, నవంబర్ 5 (మన బలగం): మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి షేక్ అయాన్ మృతి చెందడం బాధాకరమని, ఘటనకు సంబంధించి నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి షేక్ అయాన్ మృతి చెందడంతో ఘటనకు సంబంధించి ఆర్డీవో రత్న కళ్యాణి ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.సంతోష్, ఉపాధ్యాయుడు టి.రమేశ్, పీఈటీ పెంటన్న, హెల్త్ సూపర్‌వైజర్ సుజాతలను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కలెక్టర్ తెలిపారు.