Water plant siege: నిర్మల్ పట్టణంలో విచ్చలవిడిగా నీళ్లదందా కొనసాగుతోంది. ప్రజల తాగునీటి అవసరాలను గుర్తించి వీధికో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి దోచుకుంటున్నారు. ప్లాంట్లలో పరిశుభ్రత అనే ముచ్చట మచ్చుకైనా కనిపించదు. వాటర్ బాటిళ్లను శుభ్రం చేయకుండానే నీటిని నింపి విక్రయించడం, ఇళ్లకు సరఫరా చేయడం చేస్తున్నారు. మున్సిపల్ నల్లా ద్వారా వచ్చే నీరు తాగేందుకు యోగ్యంగా లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు మినరల్ వాటర్‌ను వినియోగిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దోచుకుంటున్నారు.
పడిపోతున్న భూగర్భ జలవనరులు
మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు వల్ల భూగర్భ జలం పడిపోతోంది. ప్రతినిత్యం ఈ ప్లాంట్ల ద్వారా లక్షలాది లీటర్ల నీటిని భూమి నుంచి తోడడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే వీధికో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి బోర్ల ద్వారా నీటిని తోడేస్తున్నారు. తద్వారా భూగర్భ జలం అడుగంటి పోతోంది.
వాటర్ ప్లాంట్‌పై కాలనీవాసుల ఫిర్యాదు
నిర్మల్ పట్టణంలోని బుధవార్‌పేటలో ఇళ్ల మధ్య వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ప్లాంట్ పరిసర ప్రాంతాల్లోని ఇళ్లకు నీటి సమస్య ఏర్పడింది. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోర్ల నుంచి నీరు రాకపోవడంతో ప్రజలు కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ప్లాంట్ యజమానికి చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంతో మున్సిపల్ అధికారులకు కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ దేవిదాస్, ఆర్‌వో అనూప్ కుమార్, సిబ్బంది బుధవార్‌పేటలోని లైఫ్ డ్రాప్ వాటర్ ప్లాంట్‌ను సీజ్ చేశారు.
నిబంధనలు పాటించని వాటర్ ప్లాంట్లను సీజ్ చేస్తాం
నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలు పాటించని వాటర్ ప్లాంట్లను సీజ్ చేస్తామని మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు హెచ్చరించారు. శనివారం పట్టణంలో ఒక ప్లాంట్‌ను సీజ్ చేసిన అనంతరం మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో వాటర్ ప్లాంట్లను కొనసాగిస్తున్న యజమానులు నిబంధనలకు అనుగుణంగా నడుపుకోవాలని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన ప్లాంట్లను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.