T 20 Title Winners: టీ 20 వరల్డ్ కప్‌ను ఐసీసీ మొదటి సారి 2007లో ప్రవేశపెట్టగా.. అప్పటి వరకు టీ 20 క్రికెట్ అంటేనే అయిష్టంగా ఉండే బీసీసీఐ తప్పని పరిస్థితుల్లో టీంను సౌతాఫ్రికాకు పంపింది. అప్పటి టీంలో దిగ్గజ క్రికెటర్లు అయిన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ తాము టీ 20 మ్యాచులు ఆడమని బీసీసీఐకి చెప్పగా యూత్ టీంను సౌతాఫ్రికాకు పంపింది.
అప్పటికే అంతో ఇంతో సీనియర్ అయినా యువరాజ్‌కు కెప్టెన్సీ అప్పగిస్తారనుకుంటే.. చిన్న వివాదంలో ఇరుక్కుని కెప్టెన్సీకి దూరమయ్యాడు. యువ కెరటం ఎంఎస్ ధోనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా.. మొదటి సీజన్‌లోనే భారత్‌కు టీ 20 వరల్డ్ కప్ అందించి మరుపురాని విజయాన్ని చేకూర్చాడు. అప్పటి నుంచి ఓ సారి ఫైనల్, రెండు సార్లు సెమీస్ చేరగా.. కప్ మాత్రం గెలవలేకుండానే ఇంటి బాట పడుతోంది.
ఇప్పటి వరకు ఆరు టీంలు టీ 20 వరల్డ్ కప్‌లు గెలిచాయి. వెస్టిండీస్ రెండు సార్లు టీ 20 వరల్డ్ కప్‌లో టైటిల్ ఎగరేసుకుపోగా.. 2007 లో ఇండియా, 2009 లో పాకిస్థాన్, 2010 లో ఇంగ్లండ్, 2012 లో వెస్టిండీస్, 2014 లో శ్రీలంక, 2016 లో వెస్టిండీస్ విజయం సాధించాయి. 2021లో ఆస్ట్రేలియా, 2022 తిరిగి ఇంగ్లండ్ నెగ్గి టైటిల్ విజేతగా నిలిచింది.
ఇప్పటివరకు రెండేసి సార్లు ఇంగ్లండ్, వెస్టిండీస్‌లు టీ 20 వరల్డ్ కప్ ఎగరేసుకుపోగా.. ఒక సారి ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా గెలిచి తమ సత్తా చాటుకున్నాయి. అయితే ఇప్పటి వరకు న్యూజిలాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ లాంటి టీంలు ఒక్కసారి కూడా గెలవలేకపోయాయి. ఈ సారి అమెరికాలో పొట్టి ప్రపంచ కప్ జరుగుతుండటంతో అన్ని దేశాలు కూడా ఎలాగైనా సరే కప్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.