- ఢిల్లీ ఆల్ రౌండ్ షో
- లక్నోకు మరో ఓటమి
- 19 పరుగుల తేడాతో విక్టరీ
IPL 2024 DC vs LSG: లక్నో మరో ఓటమిని మూటగట్టుకున్నది. ఢిల్లీ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. భారీ లక్ష్య ఛేదనలో బ్యాటర్లు చేతులెత్తేసారు. చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ ఆల్‌రౌండ్ షో చూపించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఐపీఎల్ 2024 సీజన్ 64వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఓపెనర్ ఫ్రెసర్ డకౌట్ అయ్యాడు. అభిషేక్ పోరెల్ 58( నాలుగు సిక్సులు, ఐదు ఫోర్లు), స్టబ్స్ 57 (నాలుగు సిక్సులు, మూడు ఫోర్లు), షై హోప్ 38 (రెండు సిక్సులు, మూడు ఫోర్లు), కెప్టెన్ రిషబ్ పంత్ 33(ఐదు ఫోర్లు) రన్స్ చేశారు. దీంతో ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసుకున్నారు.
209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో వెనువెంటనే వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఇషాన్ శర్మ సూపర్ పర్ఫార్మెన్స్‌తో లక్నో బ్యాటర్లను కట్టడి చేశాడు. మూడు వికెట్లు తీసి లక్నో నడ్డి విరిచాడు. డికాక్ 12, కెప్టెన్ రాహుల్ 5, స్టొయినిస్ 5, దీపక్ హుడా 0, నికోలస్ పూరన్ 61, ఆయుష్ బదోని 6, కృనాల్ పాండ్యా 18, అర్షద్ ఖాన్ 58, యుధ్వీర్ 14, రవి బిష్ణోయ్ 2, నవీన్ ఉల్ హక్ 2 పరుగులు చేశారు. 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 189 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఢిల్లీ 19 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్నది.