Kolkata Knight riders: కోల్‌కతా నైట్ రైడర్స్ టీం లక్నోతో మ్యాచ్ ముగించుకుని లక్నో నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో కోల్‌కతాకు బయలు దేరింది. కానీ ఫ్లైట్ బయలు దేరిన కొద్ది క్షణాలకే కోల్‌కతాలో కుండపోత వర్షం కురిసింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రయాణిస్తున్న విమానాన్ని దారి మళ్లించారు. అస్సాంలోని గువాహటికి తరలించారు. కాసేపటికే అక్కడి నుంచి మళ్లీ కోల్‌కతాకు ప్రయాణించాల్సి ఉండగా.. కోల్‌కతాకు వెళ్లే సమయంలో వాతావరణం అనుకూలించలేదు.
దీంతో వారు ప్రయాణిస్తున్న ఫ్లైట్‌ను వారణాసికి మళ్లించారు. రాత్రి వారణాసిలోని హోటల్‌లోనే ప్లేయర్లంతా బస చేశారు. ముంబయి ఇండియన్స్‌తో నెక్ట్స్ మ్యాచ్ మే 11న ఈడెన్ గార్డెన్స్‌లో ఉంది. ఇప్పటికే వాంఖడేలో ముంబయిని మట్టికరిపించి కోల్‌కతా పాయింట్స్ టేబుల్స్‌లో మొదటి స్థానంలో ఉంది.
కోల్‌కతా 11 మ్యాచులు ఆడి 8 విజయాలతో మూడు ఓటములతో మొదటి స్థానంలో కొనసాగుతుంది. ముంబయితో ఈడెన్ గార్డెన్‌లో విజయం సాధిస్తే మిగతా జట్ల గెలుపొటములతో ఎలాంటి సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్ చేరుకుంటుంది. ఇప్పటికే 16 పాయింట్లతో ఉన్న కోల్‌కతా మూడు మ్యాచుల్లో ఓడిపోయినా ప్లే ఆఫ్‌కు చేరుకునే అవకాశం ఉంది.
కానీ విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరుకుని కప్ కొట్టాలని ఉబలాటపడుతోంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ బాగానే చేస్తున్నా.. బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించాల్సిన అవసరముంది. ముంబయి ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడి నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ ఓడిపోతే అఫిషీయల్‌గా ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంటుంది. ముంబయి జట్టుకు ఊరటనిచ్చే విషయం. గత మ్యాచ్‌లో సన్ రైజర్స్‌పై విజయం సాధించి ఆత్మవిశ్వాసం పెంచుకుంది. మిగతా రెండు మ్యాచులు గెలిచి పరువు నిలుపుకునేందుకు ముంబయి ప్రయత్నాలు చేస్తుంది.