IPL 2024 RCB: ఆర్సీబీకి ఈ సీజన్‌లోనూ నిరాశే మిగిలింది. స్టార్ ప్లేయర్లు ఉన్నా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానంలో కొనసాగుతోంది. ఇక ఆర్సీబీ కప్పు అందుకోవడం స్వప్నంగానే మిగిలిపోనుందా? ఇక ఈ సీజన్‌లో పరిస్థితి అంతేనా? ప్లేఆఫ్‌కు దారులు మూసుకు పోయాయా? అంటే ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే అదే నిజమనిపిస్తోంది. ఆర్సీబీ ఇక చాప చుట్టేయడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటి వరకు 7 మ్యాచులు ఆడిన బెంగళూరు కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచులోనే విజయం సాధించింది. 6 మ్యాచుల్లో ఓటమిపాలైంది. దీంతో పాయింట్స్ టేబుల్‌లో కింది స్థానానికే పరిమితమైంది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ గేంట్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైంది. కేవలం పంజాబ్ కింగ్స్‌పై మాత్రమే విజయం సాధించింది. ఈ ఐపీఎల్‌లో ఇంకా ఏడు మ్యాచులు మిగిలి ఉన్నాయి. ఈ ఏడింటిలో అన్ని మ్యాచులు గెలుస్తానే ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే అంతే సంగతులు. వరుసగా ఏడు మ్యాచులు గెలిచినా ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయంటే అదీ చెప్పలేంద. ఇతర గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది.
వరుస ఓటములు
మార్చి 22న జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మార్చి 25న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మార్చి 29వ తేదీన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఏప్రిల్ 2న లక్నో సూపర్ గేంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఏప్రిల్ 6వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఏప్రిల్ 11న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకున్నది. ఏప్రిల్ 15న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
అసలు ఎందుకిలా?
ఆర్సీబీలో స్టార్ బ్యాట్స్‌మెన్లు ఉన్నా జట్టుకు అవసరమైన సమయంలో రాణించడంలేదు. దీనికి తోడు మిడిలాడర్ బ్యాట్స్‌మెన్లు పూర్తిగా విఫలమవుతున్నారు. చివర్లో దినేశ్ కార్తిక్ మెరుపులు మెరిపిస్తున్నా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోతున్నాడు. ఇతర బ్యాటర్స్ నుంచి సరైన సహకారం అందడంలేదు. కొహ్లీ ఒక్కడిపైనే టీమ్ ఆధారపడినట్లు కనిపిస్తున్నది. ఆ ఒక్కడు తప్ప మిగిలిన వారు పెద్దగా పరుగులు చేయడంలేదు. అడపా దడపా తప్ప రాణించడంలేదు. ఇక బౌలర్ల విషయానికి వస్తే సరైన సమయంలో వికెట్లు తీయడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. దీనికి తోడు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. నిన్న సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్ ప్రతి బౌలర్ 50 నుంచి 60 పరుగులు ఇచ్చుకున్నారు. జట్టులో సమతూకం, సమన్వయం కొరవడం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీనికి తోడు ఆర్సీబీకి లక్ కూడా కలిసి రావడంలేదు. నిన్నటి హైదరాబాద్ మ్యాచ్‌లో 287 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేస్ చేసేందుకు దిగిన ఆర్సీబీ చివరి వరకు పోరాడింది. దినేశ్ కార్తీక్ సిక్సుల వర్షం కురిపించినా జట్టుకు విజయం దక్కలేదు. 262 పరుగులు కొట్టింది. అయినా జట్టుకు నిరాశే మిగిలింది. కేవలం 25 పరుగుల తేడాతో ఓటిమిని మూటగట్టుకున్నది.