Nirmal Collector: నిర్మల్, జనవరి 20 (మన బలగం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్‌లతో కలిసి సంబంధిత అధికారులతో ఆమె నూతన పథకాల లబ్ధిదారుల గుర్తింపుకు రేపటి నుండి ఈనెల 24 వరకు గ్రామ సభల నిర్వహణపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈనెల 26 నుండి అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి కీలకమైన సంక్షేమ పథకాల అమలుకు రేపటి నుండి ఈనెల 24 వరకు నిర్వహించే గ్రామ సభలను షెడ్యుల్ వారీగా ఖచ్చితంగా సమయపాలన పాటిస్తూ నిర్వహించాలని సూచించారు. నిర్లక్ష్యాని తావు లేకుండా అధికారులందరూ అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతి ప్రత్యేక అధికారి తమకు కేటాయించిన గ్రామపంచాయతీలో గ్రామ సభ నిర్వహించాలని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డులో అర్హుల జాబితాను ప్రచురించాలని, గ్రామ సభల్లో వచ్చే అర్జీలను స్వీకరించాలని సూచించారు. గ్రామ సభలకు విస్తృత ప్రచారం కల్పించాలని, ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలలో లబ్దిదారుల జాబితాను గ్రామ సభల్లో చదివి వినిపించాలని, అభ్యంతరాలుంటే దరఖాస్తులు స్వీకరించాలన్నారు. గ్రామ, వార్డు సభలు, సంక్షేమ పథకాల రోజు వారీ ప్రక్రియను మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో గోవింద్, డిఆర్డిఓ విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, డిపిఓ శ్రీనివాస్, డిఎస్ఓ కిరణ్ కుమార్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
