Sheep Breeders’ Co-operative Societies: కరీంనగర్, జనవరి 21 (మన బలగం): గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి విడుతలో నిర్వహించాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కటికిరెడ్డి బుచ్చన్న యాదవ్, రాష్ట్ర కార్యదర్శి కడారి అయిలన్న కురుమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం కరీంనగర్ జిల్లా 2025 క్యాలెండర్‌ను మంగళవారం కరీంనగర్ ప్రెస్ భవన్‌లో ఆవిష్కరించారు. బుచ్చన్న యాదవ్, అయిలన్న కురుమతోపాటు రాష్ట్ర కోశాధికారి కాల్వ శ్రీనివాస్ యాదవ్, మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చెర్ల పద్మా యాదవ్, దుండ్ర రాజన్న యాదవ్, జిల్లా కార్యదర్శి సందవేని గీతాంజలి యాదవ్, బుస అంజన్న యాదవ్, జిల్లా అధ్యక్షులు చిగుర్ల శ్రీనివాస్ కురుమ, జిల్లా ప్రధాన కార్యదర్శి గుండువేని రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుచ్చన్న యాదవ్, అయిలన్న కురుమ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో గొర్రెల పెంపకందారుల సహకార సొసైటీలలో ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎన్నికలు పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. ఒకేసారి అన్ని గ్రామ సొసైటీలలో ఎన్నికలు నిర్వహించి, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు చైర్మన్ పదవులు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. కురుమ యాదవులకు గొర్రెల పంపిణీ ఈ ప్రభుత్వము చేస్తామని చేయలేదన్నారు.
వెంటనే 80% సబ్సిడీతో గొర్రెలు కొనుగోలు చేసి ఇప్పించాలని, ప్రభుత్వ పథకాలు అన్ని వర్తింప చేయాలని కోరారు. కురుమ యాదవ్‌లకు 50 సంవత్సరాల వారికి రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలన్నారు. దేవాదాయ చైర్మన్ పదవులు కురుమ యాదవులకు కేటాయించాలన్నారు. సర్పంచ్, జెడ్పిటిసి, ఎంపిటిసి కురుమ యాదవులు అధిక సంఖ్యలో గ్రామాలలో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. 18 శాతం ఉన్న కురుమ యాదవులకు రాజకీయంగా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ స్థానాలలో అవకాశాలు కల్పించాలన్నారు. మండల కేంద్రాలలో కమిటీ హాలు నిర్మాణ స్థలంతో పాటు భవనాలు నిర్మించి ఇవ్వాలన్నారు. మాంసం విక్రయాలు సంతలు ఏర్పాటు చేయాలన్నారు. జీవో నెంబర్ 559, జీవో నెంబర్ 1000లను సవరించి ప్రతి గ్రామానికి 5 ఎకరాల భూమి, చెరువు గట్లపై తుమ్మచెట్టు పెంచి ఇవ్వాలన్నారు. గొర్రెల మేతకు ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వాలన్నారు. గొర్రెల పెంకందారులు ప్రమాదవశాత్తు చనిపోతే ఉచిత ప్రమాద బీమా రూ.10 లక్షలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో మంచాల రవీందర్ యాదవ్, సందవేని ప్రసాద్ యాదవ్, జంగ కొమురయ్య యాదవ్, గజ్జి అయిలయ్య, మండే రాజు యాదవ్, బండి మల్లన్న యాదవ్, ఆవుల మల్లేశ్ యాదవ్, కడారి రాయుడు, నల్లంగి కొమురయ్య, మర్రి వెంకట మల్లు, జంగ తిరుపతి యాదవ్, నన్నవేని కొమురయ్య యాదవ్, బండ అనిల్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.