Collector Abhilash Abhinav: నిర్మల్, ఫిబ్రవరి 10 (మన బలగం): పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపొందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కలెక్టర్ పర్యటించి నిర్వహిస్తున్న పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 10 నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జిల్లాలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వార్డుల్లో మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు మురికి కాలువలను శుభ్రం చేసిన తర్వాత ఆయా వార్డులోని ప్రజలతో సంబంధిత రిజిస్టర్‌లో సంతకాన్ని తీసుకోవాలన్నారు. వార్డులో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజల సహకారం అవసరమన్నారు. తడి, పొడి చెత్తను పేరుగా సేకరించి చెత్త బండ్లలో వేయాలని, పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చునన్నారు. ఎప్పటికప్పుడు పిచ్చి మొక్కలు, పొదలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 9వ వార్డు సమీపంలో గల కుంటను కలెక్టర్ పరిశీలించి, మురికి నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో కుంట చుట్టూ మొక్కలు నాటి, సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. కుంటలో మురికి నీరు నిల్వ ఉండి దోమలు వ్యాప్తి చెందడం ద్వారా అనేక రకాల రోగాలు వ్యాపిస్తున్నాయని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.అనంతరం మస్కాపూర్ కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. కేజీబీవీ లోని వంటగది, సరుకుల నిల్వగది, విద్యార్థుల వసతి గృహాలను తనిఖీ చేశారు. కేజీబీవీ పరిసరాల్లో నిరంతరం పారిశుద్ధ్యని కొనసాగించాలన్నారు.
రాత్రి వేళలో సరైన లైటింగ్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల ఆవరణలో అందమైన మొక్కలను నాటాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించాలన్నారు. తరగతి గదిలో విద్యార్థులను పలు సబ్జెక్టు ల్లో ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. విద్యార్థులు సమాధానాలు చెప్పడంతో విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో గణితం లెక్కలను చేయించారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున సరైన సమయపాలన పాటిస్తూ విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ఎప్పటికప్పుడు చదవాల్సిన సిలబస్ పూర్తి చేసుకుంటూ మంచి ఫలితాలను సాధించాలన్నారు. అనంతరం సత్తెనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో చేపట్టిన శ్రమదాన కార్యక్రమంలో అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొని పిచ్చి మొక్కల్ని తొలగించి, పరిసరాలను శుభ్రం చేశారు. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జిల్లాలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులందరూ శ్రమదాన కార్యక్రమాలను చేపట్టి, కార్యాలయాలను, కార్యాలయ పరిసరాలను శుభ్రపరచుకోవాలన్నారు. నర్సరీని పరిశీలించి నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వన మహోత్సవంలో మొక్కలు నాటెందుకు సిద్ధంగా ఉంచాలన్నారు. నర్సరీ నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్ ను తనిఖీ చేశారు. కార్యక్రమాలలో డీఈఓ పి.రామారావు, డిపిఓ శ్రీనివాస్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసిల్దార్ సుజాత, సిపిఓ జీవరత్నం, ఎంపీడీవో సునీత, ఎంపీఓ రత్నాకర్, కేజీబీవీ ప్రధానోపాధ్యాయులు సునీత , విద్యార్థులు, ప్రజలు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.