- నేటి నుంచి మూడ్రోజులు వర్షాలు
- పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Rain alert: తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురియలేదు. ముందస్తుగా రుతుపవనాలు వచ్చిన చినుకు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అడపా దడపా కురిసిన వర్షాలు తప్పా భారీ వర్షాలు ఇంత వరకు కురియలేదు. గత నెలలో లోటు వర్షపాతం నమోదైంది. మెజార్టీ జిల్లాల్లో వర్షాలు లేక రైతులు ఆకాసానికేసి చూస్తున్నారు. వేసిన విత్తనాలు భూమిలో మురిగి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై కనిపించింది. పలు ప్రాంతాల్లో ముసురు పట్టేసింది. ఈ పరిస్థితి మరో మూడ్రోజులు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అంటే శుక్రవారం వరకు ముసురు కొనసాగే అవకాశముంది. అక్కడక్కడా ముసురుతోపాటు భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి. హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో తరచూ వర్షాలు పడనున్నాయి.