- పరారీలో మరో ముగ్గురు నిందితులు
- 31.5 తులాల బంగారం రికవరీ
- వివరాలు వెల్లడించిన జగిత్యాల డీఎస్పీ రఘు చందర్
accused arrested: జగిత్యాల, డిసెంబర్ 23 (మన బలగం): ఇటీవల జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్‌లో జరిగిన బంగారం చోరీ కేసులో అంతర్రాష్ట్ర ముఠా సభ్యురాలిని అదుపులోకి తీసుకున్నామని, ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జగిత్యాల పాత బస్టాండ్‌లో మిట్టపల్లి జలజకు చెందిన బ్యాగ్‌ను కత్తిరించి 37 తులాల బంగారం చోరీ చేసారు. చోరీ జరిగిన విధానంపై ఇతర ప్రాంతాల్లో జరిగిన చోరీ సంఘటనలను పరిశీలించగా ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసు పరిశోధనకు టౌన్ ఇన్‌స్పెక్టర్ వేణు గోపాల్ ఆధ్వర్యంలో ఎస్ఐ కిరణ్, హెడ్ కానిస్టేబుల్ నాసిర్ ఖాన్, కానిస్టేబుల్ జీవన్ బృందం రంగంలోకి దిగింది. ఈ ముఠా సిరిసిల్ల, ఆర్మూర్, నిజామాబాద్ బస్టాండ్లలోనూ ప్రయాణికులపై నిఘా పెట్టి దోపిడీ చేసినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. నిందితులు పోలీసులకు చిక్కకుండా దొంగిలించిన బంగారంతో వేర్వేరు ప్రాంతాలకు పారిపోయారు. జగిత్యాల పాత బస్టాండ్‌లో చోరీ చేసిన నగలను శ్రీరాంనగర్ ప్రాంతంలో అమ్మేందుకు వస్తున్నారన్న పక్కా సమాచారంతో నిఘా పెట్టగా ముఠాలోని సభ్యులలో మహారాష్ట్రకు చెందిన హత్కాడే కాంతను పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి 31.5 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగతా ముగ్గురు సభ్యులు స్వప్న మిథున్ లాండే, హత్కాడే గుజనా, సంజన నాడేల కోసం గాలిస్తున్నారు.