జిల్లా ఆస్పత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలు
IVF Centers: రాష్ట్రంలో సంతాన లేమి సమస్యతో బాధపడుతున్న జంటల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, కుటుంబ పరిస్థితుల కారణంగా అధిక శాతం జంటలు ఈ సమస్యతో బాధపడుతున్నాయి. ప్రైవేటు దవాఖానలో లక్షలు ఖర్చు చేసి వైద్య సదుపాయాలు పొందలేని వారు సమస్యను అధిగమించలేక సంతానలేమితో సతమతమవుతున్నారు. ఇలాంటి వారికి రాష్ర్ట ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ర్టంలోనే మొదటిసారిగా మంగళవారం గాంధీ దవాఖానలో ఫెర్టిలిటీ సెంటర్‌లో ఐవీఎఫ్ సేవలు అందులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్‌లో మరో రెండు దవాఖానలు, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో ఐవీఎఫ్ సెటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సంతాన లేమి సమస్య యువ జంటల్లోనే ఎక్కువగా ఉంటోంది.
ప్రతి వంద జంటల్లో 30కిపైగా జంటల్లో సమస్యను గుర్తించినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో ఐవీఎఫ్ సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటులో వైద్యం చేయించుకునే ఆర్థిక పరిస్థితి లేక మానసిక సంఘర్షణను ఎదుర్కొంటున్నారు. ఇటీవల చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రసాదం స్వీకరించేందుకు సంతానంలేని మహిళలు లక్షకుపైగా హాజరుకావడం పరిస్థితికి అద్దంపడుతోంది. సంతానం కలగపోవడంలో లోపం వివిధ రకాలుగా ఉంటోంది. కొన్ని జంటల్లో మహిళలు, మరికొన్ని జంటల్లో పురుషులు, ఇంకొన్ని జంటల్లో ఇరువురిలోనూ లోపాలు ఉంటున్నాయి. పెళ్లయిన జంటలు పిల్లల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సిన పరిస్థితుల్లో మానసిక వేదనకు గురవుతున్నారు. సంతానలేనిమి సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం మొదటగా నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. తరువాత దశలవారీగా జిల్లా కేంద్రాలకు విస్తరించనుంది. ఈ మేరకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.