Start of AC bus: ధర్మపురి, అక్టోబర్ 11 (మన బలగం): ధర్మపురి నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సును శుక్రవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ప్రతి రోజూ ఉదయం 11.30 స్థానిక బస్టాండ్ నుంచి ధర్మపురి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో ఏసీ బస్సు సౌకర్యం కల్పించాలని కొన్నేళ్లుగా వినతులు వస్తున్నా విప్ లక్ష్మణ్ చొరవతో స్థానికుల కోరిక నెరవేరింది. ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ధర్మపురికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరిన వెంటనే మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో ధర్మపురికి బస్ డిపోను తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బస్ డిపో విషయమై ఇదివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.