Jagityal Collector
Jagityal Collector

Jagityal Collector: ప్రజాపాలన దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు.. జగిత్యాల కలెక్టర్ బి.సత్య ప్రసాద్

Jagityal Collector: ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జగిత్యాల కలెక్టర్ బి.సత్య ప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసిందని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పతాకావిష్కరణ చేయాలని తెలిపారు. వేడుకలను కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొదటగా జాతీయ గీతం ఆలపించిన తర్వాత, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ముఖ్య అతిథి ప్రసంగం ఉంటుందని వెల్లడించారు. మైక్ ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు కలిగి ప్రసంగానికి అవాంతరం కలుగరాదనీ ఆదేశించారు.

ఉదయం 10 గంటల్లోగా ఉద్యోగులు అందరూ కార్యాలయానికి హాజరు కావాలని పేర్కొన్నారు. ప్రొటోకాల్, షామియా మొదలగు వాటికి సంబంధించినవి చూసుకోవాలని ఆర్డీఓలకు కలెక్టర్ సూచించారు. అంబులెన్స్, ప్రథమ చికిత్సకు సంబంధించిన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, తహశీల్దార్లు అందరూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. గ్రామ పంచాయతీలో సెక్రటరీలు జెండా ఎగురేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎలాంటి సమస్యలు రాకూడదని, వస్తే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతకు ముందు కలెక్టరేట్ పరిసరాలను కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు పి.రాంబాబు, గౌతం రెడ్డి, జగిత్యాల, మెట్‌పల్లి ఆర్డీఓలు మధుసూదన్, శ్రీనివాస్, డీఎస్పీ రఘుచందర్, కలెక్టరేట్ ఏవో హన్మంత రావు, జిల్లా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *