- రిజర్వేషన్లపై బీజేపీని టార్గెట్ చేసిన కాంగ్రెస్
- మైలేజీ కోసం మాటల యుద్ధం
- దీటుగా తిప్పికొడుతున్న కాషాయం నేతలు
- హస్తం పార్టీ ప్లాన్ వర్కవుట్‌పై డౌట్
- ఫేక్ వీడియోపై సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు
- చివరికి ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..?
Congress targeting BJP on reservation: ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. హిందువుల బంగారం, పుస్తెలతాడు లాక్కొని ముస్లిములకు పంచిపెడుతుంది. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు తమ పార్టీ పూర్తి వ్యతిరేకం. ఇలాంటి వాటిని తొలగిస్తాం. వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సమానంగా పంచుతాం. దీంతో అన్ని వర్గాలకు సమన్యాయం చేకూరుతుంది.’
– రాజస్తాన్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ.
‘కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది. పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజార్టీ తెచ్చుకొని రాజ్యాంగ సవరణ చేస్తుంది. దేశం మొత్తాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తుంది. దేశంలో 85 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలవారే ఉన్నారు. ఇప్పటి వరకు ఆయా వర్గాలకు ఉన్న రిజర్వేషన్లను తొలగిస్తుంది. దీంతో అన్ని వర్గాల వారికి నష్టం చేకూరుతుంది.’
– ప్రచార సభల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఇలాంటి వ్యాఖ్యలు మేలు చేస్తాయని ఇరు పార్టీల వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ తమ వ్యాఖ్యలను సమర్థించుకుంటూ వివరణ ఇచ్చుకుంటుండగా.. కాంగ్రెస్ మాత్రం ఆ అంశాన్ని ప్రజల్లోకి నెగెటివ్ మోడ్‌లోకి తీసుకెళ్తుంది. దీనివల్ల ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో లాభపడాలని చూస్తున్నది. ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం అంతా గమనిస్తున్న ఓటర్లు.. చివరికి ఎవరి వైపు నిలబడుతారో మే 13న జరిగే పోలింగ్, జూన్ 4న జరిగే కౌంటింగ్ తేదీన తెలుస్తుంది.
రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తున్నది. రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఓ పార్టీ అంటుంటే.. తమ మాటలను వక్రీకరించారని, తాము మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమంటూ మరో పార్టీ చెబుతున్నది. ఈ క్రమంలో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న స్ర్టాటజీ వర్కవుట్ అవుతుందా? అన్నది ప్రశ్నార్థకంగానే మారింది. దీనికితోడు రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్‌కు ఈ వ్యాఖ్యలు కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత మూటగట్టుకుంటున్నదని, వారి విధానం బీజేపీకే కలిసి వచ్చే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అసలు ప్రధాని మోడీ ఏమన్నారు..?
‘మతపరమైన రిజర్వేషన్ల కారణంగా ఎంతో మందికి అన్యాయం జరుగుతుంది. బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీలు లాంటి అణగారిన వర్గాలకు రిజర్వేషన్ల కారణంగా తగిన న్యాయం జరగడం లేదు. రిజర్వేషన్లు అనేవి మతపరంగా ఉంటే అసలు అంగీకరించే ప్రసక్తి లేదు’ అంటూ మోడీ తేల్చి చెప్పారు. ఒకరకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది. వారి కోసమే రిజర్వేషన్లలో మార్పులు, చేర్పులు ఉంటాయని తేల్చి చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నదేంటి?
‘2025 వరకు ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు అవుతుంది. ఈలోగా భారత్‌ను రిజర్వేషన్ రహితంగా, హిందూ దేశంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ ఎప్పుడో నిర్ణయించుకుంది. దీనికోసమే బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. 400 లోక్‌సభ స్థానాల్లో గెలిచి ఎవరికీ రిజర్వేషన్లు లేకుండా రద్దు చేయాలని కుట్ర చేస్తుంది. ఈ విషయం బీజేపీలో ఉన్న కీలక నేతలందరికీ తెలుసు. అందుకే వారు రిజర్వేషన్ల గురించి పెద్దగా మాట్లాడడం లేదు. ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి పొందేందుకే బీజేపీ ప్రయత్నిస్తున్నది.’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.
ఫేక్ వీడియోపై సీఎంకు నోటీసులు
రిజర్వేషన్ల అంశానికి సంబంధించి టీపీసీసీ తయారు చేసిన ఫేక్ వీడియో రాష్ట్రంలో సంచలనం రేపింది. బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ అమిత్ షా సదరు వీడియోలో మాట్లాడినట్లు టీపీసీసీ ట్విట్టర్‌లో పోస్టు అయ్యింది. ఈవిషయమై బీజేపీ నాయకుడు ప్రేమేందర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 25న సిద్దిపేటలో ముస్లిం రిజర్వేషన్ల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ క్రమంలో టీపీసీసీ ట్విట్టర్‌లో కనిపించిన వీడియోతో రాష్ట్రంలో పలు రకాల చర్చలు మొదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ నెల 27న మీడియా సమావేశంలో రిజర్వేషన్ల అంశంపై బీజేపీ వైఖరిని తీవ్రంగా ఖండించారు. అమిత్ షా ఎడిటెడ్ (ఫేక్ వీడియో)ను ట్విట్టర్‌తో పాటు ఫేస్ బుక్ మాధ్యమాల్లో తెలంగాణ పీసీసీ ప్రసారం చేసింది. దీంతో ఫేస్ బుక్, ట్విట్టర్ సంస్థల యాజమాన్యానికి కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
‘రిజర్వేషన్ల’ వ్యాఖ్యలతో ఎవరికి లాభం?
రిజర్వేషన్లు ఓ వర్గానికి రద్దు చేస్తామని బీజేపీ అంటుంటే, మొత్తానికే రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు రెండు పార్టీల నాయకుల మాటలను నిశితంగా వింటున్నారు. ప్రధాని మోడీ రిజర్వేషన్ల అంశంపై ఏమన్నారో కేంద్ర మంత్రులు, రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు స్పష్టతనిస్తున్నారు. కానీ సీఎం రేవంత్ మాత్రం రిజర్వేషన్లు మొత్తానికే రద్దు చేస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని బీజేపీ లీడర్లు తిప్పికొడుతుండగా, కాంగ్రెస్ మాత్రం పదేపదే ఆ అంశాన్నే ప్రస్తావిస్తూ ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీని కాంగ్రెస్ ఇరకాటంలో పెట్టాలని చూసినా గతంలో కంటే మెరుగైన స్థానాలను సాధించింది. ఇప్పుడు సైతం ఆ స్ట్రాటజీనే ఫాలో అవుతున్న కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లో సైతం బీజేపీకి మైలేజీ వచ్చి ఎక్కువ స్థానాల్లో గెలిచేలా చేస్తున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ రిజర్వేషన్ల రద్దు వ్యాఖ్యలు పార్టీకి ఏ మేరకు మైలేజీతెస్తాయో, ఎక్కువ స్థానాల్లో గెలిచేలా సహాయ పడుతుందో వేచిచూడాల్సిందే.