- ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం
- మైనింగ్ శాఖకు చేరని ఇసుక
- సెక్యూరిటీ సిబ్బంది పాత్రపై అనుమానాలు
- జగిత్యాల ఆర్టీసీ డిపోలో ఘటన
Sand Thieves: జగిత్యాల ప్రతినిధి, జనవరి 20 (మన బలగం): జగిత్యాల ఆర్టీఏ అధికారులు ఆరేండ్ల క్రితం వాహనాల తనిఖీలో ఇసుక లోడుతో వెళ్తున్న లారీని సీజ్ చేసి జగిత్యాల ఆర్టీసీ డిపోలో భద్రపరిచారు. లారీ రిలీజై పోగా అక్కడే పోసిన ఇసుక మాయమైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జగిత్యాల ఆర్టీఏ అధికారులు 2018లో వాహనాల తనిఖీల్లో ఇసుక లోడ్‌తో పోతున్న ఏపీ 15 టీబీ 2599 లారీని పట్టుకున్నట్లు సమాచారం. సరైన కాగితాలు లేని కారణంతో సీజ్ చేసిన లారీని జగిత్యాల ఆర్టీసీ డిపోలో భద్రపరిచారు. ఈ లారీ యజమాని ప్రైవేటు ఫైనాన్సియర్ల వద్ద లోన్ తీసుకొని లారీని కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఆర్టీఏ అధికారులు విధించిన ఫైన్లను లారీ యజమాని ఏండ్లుగా కట్టకపోవడం, ఫైనాన్స్ నిర్వాహకులకు అప్పు ముట్టకపోవడంతో ఆనాటి నుంచి ఆర్టీసీ డిపోలోనే లారీ ఉండిపోయింది. ఈ లారీని ఫైనాన్స్ నిర్వాహకులు ఫైన్లు చెల్లించి డిసెంబర్ (2024) లోనే విడిపించుకొన్నట్లు సమాచారం. తీరా లారీని తీసుకెళ్లే టోచర్ వాహనం ఏపీ 12 జే 8631 ఇసుకను డిపోలోనే పోసి లారీని తీసుకెళ్లినట్లు తెలిసింది. అక్కడే ఉన్న ఇసుకపై కొందరు సెక్యూరిటీ సిబ్బంది కండ్లు పడి రెండు ట్రాక్టర్లతో ఆ ఇసుకను బయటకు తరలించి అమ్ముకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం
జగిత్యాల ఆర్టీఏ అధికారులు పట్టుకొన్న లారీనే సరైన ధ్రువీకరణ పత్రాలు లేవనే కారణంతోనే పట్టుకొన్న అధికారులు అందులోని ఇసుకపై దృష్టి సారించక పోవడంతోనే ఇసుక మాయం కావడానికి కారణమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లారీని సీజ్ చేసిన రోజే ఇసుకను మైనింగ్ అధికారులకు అప్పగించినా నేడు ఇసుక అక్రమ తరలింపు జరిగేది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
తిలా పాపం తలా పిడికెడు
2018లో ఇసుకతో పట్టుబడ్డ లారీలోని ఇసుకలో కొంత భాగాన్ని జగిత్యాల ఆర్టీసీ డిపో అధికారులు వాడుకొన్నట్లు తెలిసింది. డిపో ఆవరణలో ఉన్న ఆయిల్ ట్యాంక్‌ల మధ్యలో ఈ ఇసుకనే నింపినట్లు తెలిసింది. అంతే కాకుండా అదే డిపోలో ఉన్న మరో ట్రాక్టర్‌లో ఉన్న ఇటుకలను, ఈ ఇసుకను ఓ నిర్మాణానికి వాడుకొన్నట్లు తెలిసింది. ఇలా డిపో అధికారులే పట్టుబడ్డ ఇసుకను వాడుకోగా తమకేమైతుందని సెక్యూరిటీ సిబ్బంది రెండు ట్రాక్టర్లతో తరలించారేమోనన్న ప్రచారం జరుగుతోంది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు మారి ప్రభుత్వ ఆస్తి మాయమై రెండు డిపార్ట్‌మెంట్ల నిర్వాకమా అన్న ప్రచారం జరుగుతోంది.
జిల్లా కలెక్టర్ స్పందించాలి
జగిత్యాల ఆర్టీసీ డిపోలో నుంచి మాయమైన ఇసుక, అక్రమ ఇసుక వినియోగంపై, జగిత్యాల ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్య వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ విధులు నిర్వహిస్తూ మరికొందరికి మార్గదర్శకులుగా నిలవాల్సిన అధికారులు దారితప్పడంపై సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కారాదంటే సత్వరమే చర్యలు తీసుకోవాల్సిందేనని పలువురు కోరుతున్నారు.