Custom Milling Rice: నిర్మల్, జనవరి 20 (మన బలగం): కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఎంఆర్ సరఫరాపై సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ ఒక్క మిల్లరు సీఎంఆర్ సరఫరాలో వేగం పెంచాలని ఆదేశించారు. సీఎంఆర్ సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్దేశించిన సీఎంఆర్ లక్ష్యం, పూర్తిచేసిన సరఫరా, నిల్వ ఉన్న ధాన్యం, రోజు వారిగా తరలిస్తున్న ధాన్యపు లారీల వివరాలను మిల్లర్ల వారీగా సమీక్షించారు. రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులు క్షేత్ర స్థాయిలో మిల్లులను తనిఖీ చేసి సీఎంఆర్ ప్రక్రియ తీరు, మిల్లులో ధాన్యం నిల్వ, సామర్థ్యం, మిల్లులో నిల్వ ఉన్న ధాన్యం, అన్ లోడింగ్ తదితర అంశాలను పరిశీలించి రోజువారీ నివేదికలను అందజేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్‌వో కిరణ్ కుమార్, డీఎం సివిల్ సప్లయిస్ వేణుగోపాల్, రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు, మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు.
