Chakali Ailamma Jayanti: తెలంగాణ సాయుధ పోరాటంలో ఉవ్వెత్తున ఎగిసే ఉద్యమానికి ఊపిరి పోసి తన ప్రాణాలను త్యాగం చేసి ఉద్యమ స్ఫూర్తి నింపిన వీర వనిత చాకలి ఐలమ్మ అని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐలమ్మ చిత్ర పటానికి ఎస్పీ పూలమాల వేసి నివాళులుర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ సాయుధ పోరాట కాలంలోనే తన హక్కుల సాధన కోసం, చట్టం పరిధిలో, కోర్టుల్లో న్యాయం కోసం కొట్లాడిన గొప్ప ప్రజాస్వామికవాది చిట్యాల ఐలమ్మ అన్నారు. తెలంగాణ స్వాతంత్రోద్యమంలో, నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. తెలంగాణ స్వాతంత్రోద్యమ సమరయోధులను స్మరించుకోవడం మనందరి బాధ్యతని, వారి ఆశయాలను కొనసాగించాలని ఎస్పీ అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు రావు, ఏవో శశికళ, డీఎస్పీ రవీంద్ర కుమార్, డీసీఆర్‌బీ, ఎస్బీ ఇన్‌స్పెక్టర్లు, శ్రీనివాస్, ఆరిఫ్ అలీ ఖాన్, ఆర్ఐలు రామక్రిష్ణ, వేణు, ఆర్ఎస్ఐలు, డీపీవో కార్యాలయ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.