Bitcoin
Bitcoin

Bitcoin: బాబోయ్ బిట్ కాయిన్

  • విదేశాలకు టూర్లు, విందులు
  • గొలుసు వ్యాపారంలో ఉపాధ్యాయులే కీలకం
  • నిర్మల్ జిల్లాలో రూ.200 కోట్ల వ్యాపారం
  • ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు
  • లబోదిబో అంటున్న బాధితులు
  • సయోధ్యకు సన్నాహాలు

Bitcoin: నిర్మల్, సెప్టెంబరు 26 (మన బలగం): గాలి మోటార్లలో విహారయాత్రలు.. స్టార్ హోటళ్లలో విందులు.. వినోదాలతో మురిసిపోయారు.. రోజూ కాసుల వర్షం కురిసింది.. ఇంకేం కావాలి అసలు నౌకరిని పక్కనపెట్టి.. కొసరు బిట్ కాయిన్ దందాలో తరించారు మన గురువులు.. చివరికి కటకటాలపాలై ఊచలు లెక్కిస్తున్నారు. ఇది మన జిల్లాలోని కొందరు ఉపాధ్యాయుల తీరు.. వివరాల్లోకి వెళ్తే గొలుసుకట్టు వ్యాపారమైన బిట్ కాయిన్ దందా నిర్మల్ జిల్లాలో మూడు పువ్వులు ఆరు కాయిన్‌లుగా వీరాజిల్లింది.

విదేశీ ప్రయాణాలు, విందులు

బిట్ కాయిన్ గొలుసు కట్టు వ్యాపారంలో ఎక్కువ మంది చేత పెట్టుబడులు పెట్టిస్తే విదేశీ ప్రయాణాలు, స్టార్ హోటల్లో బస, విందులు, అదనపు కమీషన్లు ఎర చూపడంతో బాగా ఆకర్షితులయ్యారు. ఉద్యోగులు, చోటామోటా లీడర్లు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. ఇందులో మొదటి స్థానంలో ఉపాధ్యాయులు ఉన్నారు. అమాయక ప్రజల చేత కోట్లాది రూపాయలను గొలుసుకట్టు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టించారు. లక్షల్లో కమీషన్లు పొందారు.

ఉపాధ్యాయులే కీలకం

గొలుసుకట్టు వ్యాపారమైన బిట్ కాయిన్ దందాలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారు. నిర్మల్ జిల్లాలోని కడెం, ఖానాపూర్, నిర్మల్, కుబీర్, తానూర్, ముధోల్ మండలాల పరిధిలోని ఉపాధ్యాయులు ఈ గొలుసుకట్టు వ్యాపారంలో చురుకుగా పాల్గొన్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా సుమారు 200 మంది ఉపాధ్యాయులు ఈ గొలుసుకట్టు వ్యాపారంతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాపారంతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేయగా అందులో ఐదుగురు ఉపాధ్యాయులే ఉన్నారు. వీరిని న్యాయస్థానం ముందు హాజరు పరచగా రిమాండ్‌కు తరలించారు.

నిర్మల్ జిల్లాలో రూ.200 కోట్ల వ్యాపారం

నిర్మల్ జిల్లాలో బిట్ కాయిన్ వ్యాపారంలో సుమారు 200 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో ఉపాధ్యాయులు, చోటామోటా లీడర్లు అమాయక ప్రజలకు మాయ మాటలు చెప్పి ఈ రొంపిలోకి దించారు. అధిక కమీషన్లు వస్తాయని ఎర చూపడంతో ఆస్తులను తాకట్టు పెట్టి, అప్పులు చేసి, పర్సనల్ లోన్లను తీసుకొని ఈ గొలుసుకట్టు దందాలో పెట్టుబడులు పెట్టారు. కమీషన్లకు కక్కుర్తిపడి అమాయక ప్రజలను మోసం చేసారు.

కటకటాల పాలైన 8 మంది

బిట్ కాయిన్ దందాలో పెట్టుబడులను పెట్టే విధంగా ప్రజలను ప్రోత్సహించిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసారు. న్యాయస్థానంలో హాజరు పరచగా వారికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. అరెస్ట్ అయిన వారంతా ప్రభుత్వ ఉద్యోగులే. ఎక్సైజ్ ఎస్సై, ఆర్మీ జవాన్, పోలీస్ కానిస్టేబుల్, మిగతా ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ అక్రమ వ్యాపారంతో సంబంధం ఉన్న మిగతా వారిని త్వరలోనే గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.

లబోదిబో అంటున్న బాధితులు

మాయ మాటలు నమ్మి బిట్ కాయిన్ దందాలో డబ్బులు డిపాజిట్ చేసిన ప్రజలు లబోదిబో అంటున్నారు. బయట నుంచి వివిధ రకాలుగా అప్పులు చేసి తెచ్చిన డబ్బులను అధిక కమీషన్ల ఆశతో పెట్టుబడులు పెట్టారు. తీరా పెట్టుబడులు పెట్టిన వ్యాపారం మోసమని తేలడంతో ఆందోళనకు గురవుతున్నారు. తమ డబ్బులను తిరిగి ఇప్పించాలని పెట్టుబడులు పెట్టించిన వారిపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

సయోధ్యకు సన్నాహాలు

బిట్ కాయిన్ దందాపై పోలీసులు కొరడాఝళిపించడంతో ఈ అక్రమ దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని అన్ని ప్రసారమాధ్యమాల్లో విస్తృతంగా ప్రచురించడంతో పెట్టుబడులు పెట్టించిన పెద్దలు ఇరకాటంలో పడ్డారు. ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇంకా ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేస్తారని ప్రచారం జరగడంతో తప్పించుకునేందుకు సయోధ్యకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ అరెస్టు అయితే సమాజంలో పరువు పోతుందనే ఉద్దేశంతో పోలీసులతో, మీడియాతో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు ఓ వర్గాన్ని కలిసి ప్రయత్నం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బిట్ కాయిన్ వ్యవహారంలో పోలీసులు సైతం చాలా సీరియస్‌గా ఉన్నారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల బిట్ కాయిన్ వ్యవహారంలో కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకునేందుకు ఓ ప్రత్యేక బృందాన్నే ఏర్పాటు చేశారు. దీంతో ఈ గొలుసుకట్టు వ్యవహారంలో పాలుపంచుకున్న వ్యక్తుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *