Nirmal Collector Abhilash Abhinav: నిర్మల్, జనవరి 28 (మన బలగం): విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని పరీక్షలకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో ఎస్సీ, బీసీ వసతి గృహాల పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రేరణ, శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పదో తరగతి విద్యార్థులు భయం వీడి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. పరీక్షలకు రానున్న రెండు నెలలు కీలకమని, సమయం వృథా చేయకుండా మీ కలలను నిజం చేసుకోవడానికి కృషి చేయాలని కోరారు. ఇప్పటికే సిలబస్ పూర్తయినందున ప్రత్యేక తరగతులకు వందశాతం విద్యార్థులు హాజరు కావాలని అన్నారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల సందేహాలను సంబంధిత ఉపాధ్యాయులు నివృత్తి చేయాలని సూచించారు. గత సంవత్సర 10వ తరగతి ప్రశ్నాపత్రాలను పరిశీలించి ప్రశ్నలకు జవాబులు రాయడం, చదవడం ప్రాక్టీస్ చేయాలని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మీకు అండగా ఉంటారని, చదువులో క్రమశిక్షణను పాటిస్తూ నిబద్ధతతో లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. ఆరోగ్యాన్ని, మానసిక శక్తిని కాపాడుకోవాలని, ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించి, జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలవాలని సూచించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా యంత్రాంగం ప్రోత్సకాలను అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. అంతకుముందు విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల తీరును అధికారులు, ఉపాధ్యాయులను కలెక్టర్ అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి.రామారావు, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు శ్రీనివాస్, రాజేశ్వర్ గౌడ్, వార్డెన్లు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
