Modi International awards: భారతావని గర్వించదగిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఖ్యాతి ఇంతింతై వటుడింతై అన్నట్లు నలు దిశలా విస్తరిస్తోంది. ప్రపంచ దేశాల్లో ఎటు చూసినా మోడీ నామ జపమే వినిపిస్తోంది. ‘గ్లోబల్ స్టార్’గా అవరిస్తున్న మోడీకి వివిధ దేశాలు అత్యుత్తమ పురస్కారాలు ప్రదానం చేసి గౌరవిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ ప్రధాని సాధించని ఘనతను మోడీ సాధించారు. వివిధ దేశాలకు చెందిన 19 అంతర్జాతీయ పురస్కారాలు అందుకొని కొత్త చరిత్రను సృష్టించారు. ఇప్పటికే వీటిలో16 దేశాల పురస్కారాలు మోడీ అందుకున్నారు. మరో మూడు దేశాల పురస్కారాలు అందుకోవాల్సి ఉంది. సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్థాన్, పాలస్తీనా, యూఏఈ, రష్యా, మాల్దీవులు, బెహ్రెయిన్, అమెరికా, భూటాన్, పాపువా న్యూ గినియా, ఈజిప్ట్, ఫిజి, ఫ్రాన్స్, గ్రీస్, నైజీరియా దేశాలు తమ అత్యుత్తమ పురస్కారాలు భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రదానం చేశాయి. ఇటీవల డొమినికా దేశం అత్యుత్తమ జాతీయ పురస్కారం డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్‌ను ప్రధాని మోడీకి ప్రకటించింది. తాజాగా బుధవారం (నవంబర్ 20, 2024) గయానా, బార్బడోస్ దేశాలు అవార్డులు ప్రకటించాయి. గయానా జాతీయ పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’, బార్బడోస్ ప్రతిష్టాత్మకమైన ‘ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్’ పురస్కారాలను ప్రకటించాయి.
సౌదీ అరేబియా: ఏప్రిల్ 3, 2016న సౌదీ అరేబియా అత్యున్నత పౌరస్కారమైన కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్ పురస్కారాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వీకరించారు. దీన్ని రాయల్ కోర్ట్‌లో కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ప్రదానం చేశారు.
ఆఫ్ఘనిస్థాన్: జూన్ 5, 2016న ఆఫ్ఘనిస్థాన్ అత్యున్నత పౌరపుస్కారం అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. హెరాత్‌లో ల్యాండ్ మార్క్ ఆఫ్ఘన్ – ఇండియా ఫ్రెండ్‌షిప్ డ్యామ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ మోడీకి అవార్డును అందజేశారు.
పాలస్తీనా: ఫిబ్రవరి 10, 2018న పాలస్తీనా అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా’ను భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వీకరించారు. రమల్లాలో ద్వైపాక్షిక సమావేశాల్లో ఆ దేశ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ పురస్కారాన్ని మోడీకి ప్రదానం చేశారు. భారత్ – పాలస్తీనా మధ్య సత్ససంబంధాలు పెంపొందించేందుకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE): ఆగస్టు 24, 2019న యూఏఈ అత్యున్నత పౌరపురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ను భారత ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. అబుదాబిలోని ప్రెసిడెన్సియల్ ప్యాలెస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మహ్మద్ బిన జాయెద్ అల్ నహ్యాన్ మోడీకి అవార్డును ప్రదానం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ రాణి ఎలిజబెత్ -2, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ అవార్డును అందుకున్నవారిలో ఉన్నారు.
రష్యా: జులై 9, 2024న రష్యా అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ ది ఫస్ట్-కాల్డ్’ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అందుకున్నారు. మాస్కోలోని క్రెమ్లిన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ పురస్కారాన్ని మోడీకి ప్రదానం చేశారు.
మాల్దీవులు: జూన్ 8, 2019న మాల్దీవుల అత్యున్నత పురస్కారం ‘ది మోస్ట్ హానరబుల్ ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్’ను భారత ప్రధాని మోడీ స్వీకరించారు. మాలేలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం మొహ్మద్ సోలిహ్ మోడీకి అవార్డును ప్రదానం చేశారు.
బహ్రెయిన్: ఆగస్టు 25, 2019న బహ్రెయిన్ అత్యున్నత పురస్కారం ‘కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ రినైసెన్స్’ను భారత ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. బహ్రెయిన్ పర్యటన సందర్భంగా ఆ దేశ రాజు హమద్ బిన్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మోడీకి ప్రదానం చేశారు.
భూటాన్: మార్చి 22, 2024న భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అందుకున్నారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ పురస్కారాన్ని మోడీకి ప్రదానం చేశారు.
పాపువా న్యూ గినియ: మే 22, 2023న పలావ్ టూల్ ‘ఎబాకల్’ను భారత ప్రధాని మోడీ అందుకున్నారు. దీనిని రిపబ్లిక్ ఆఫ్ పలావు అధ్యక్షుడు సురాంగెల్ S.విప్స్, జూనియర్ ప్రధాని మోడీకి బహూకరించారు.
ఫిజి: మే 22, 2023న ఫిజి అత్యున్నత పురస్కారం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఫిజిని భారత ప్రధాని మోడీ స్వీకరించారు. ఆ దేశ ప్రధాన సితివేని రబుకా మోడీకి పతకాన్ని ప్రదానం చేశారు.
పాపువా న్యూ గినియా: మే 22, 2023న పాపువా న్యూ గినియా అత్యున్నత పురస్కారం ‘కంపానియన్ ఆఫ్ ఆర్డర్ లోగోహు’ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడ అందుకున్నారు. పాపువా న్యూ గినియా గవర్న్ జనరల్ సర్ బాబ్ దాడే పురస్కారాన్ని మోడీకి అందజేశారు.
ఈజిప్ట్: 25 జూన్ 2023న ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది నైలు’ను భారత ప్రధాని మోడీ స్వీకరించారు. ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి పుస్కారాన్ని మోడీకి ప్రదానం చేశారు.
ఫ్రాన్స్: జూలై 14, 2023న ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్’ను నరేంద్ర మోడీ స్వీకరించారు. పురస్కారాన్ని ఆ దేశ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ మోడీకి ప్రదానం చేశారు.
గ్రీస్: 25 ఆగస్టు, 2023న గ్రీస్ అత్యున్నత పురస్కారం ‘గ్రీస్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్’ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అందుకున్నారు. ఈ పురస్కారాన్ని గ్రీస్ అధ్యక్షురాలు కాటెరినా ఎన్ సకెల్లారోపౌలౌ ప్రదానం చేశారు.
నైజీరియా: నవంబర్ 17, 2024న నైజీరియా అత్యున్నత జాతీయ గౌరవం ‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ నైజర్’ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అందుకున్నారు. నైజీరియా ప్రెసిడెంట్ బోలా అహ్మద్ టినుబు పురస్కారాన్ని మోడీకి అందజేశారు. 1969లో క్వీన్ ఎలిజబెత్-2 తరువాత ఈ అవార్డు అందుకున్న రెండో విదేశీ జాతీయుడు మోడీ కావడం గమనార్హం.
వీటితోపాటు అంతర్జాతీయంగా అనేక పురస్కారాలు అందుకున్నారు. 2018లో సియోల్ శాంతి బహుమతి, యునైటెడ్ నేషన్స్ చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు అందుకున్నారు.2019లో ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్, గ్లోబల్ గోల్ కీపర్ అవార్డులు అందుకున్నారు. 2021లో గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ లీడర్‌షిప్ అవార్డు స్వీకరించారు.