ధర్మపురి మండలంలోని జైనలో గ్రామ సభ
Uttam Kumar Reddy: జగిత్యాల ప్రతినిధి, జనవరి 22 (మన బలగం): రాష్ట్రంలోనే అర్హులైన చివరి లబ్ధిదారుడి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎంఎల్‌సి జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్‌లతో కలిసి ధర్మపురి మండలలోని జైన గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మహిళలకు, రైతులకు, రైతు కూలీలకు, నిరుద్యోగులకు, పేదలకు ఈ స్థాయిలో ఏ ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో మేలు చేయలేదని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి సుమారు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని, గత 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఈ స్థాయిలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, కేవలం 40 వేల కార్డులు మాత్రం అందించారని అన్నారు. జనవరి 26 నాడు ప్రారంభించి రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డు వచ్చే వరకు ప్రక్రియ కొనసాగుతుందని, రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని, ప్రజా పాలన కేంద్రాలలో దరఖాస్తు చేసిన, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసినా, గ్రామ సభలలో దరఖాస్తు ఇచ్చిన విచారించి అర్హత మేరకు కార్డులు మంజూరు చేస్తామని అన్నారు. గ్రామ సభలో ప్రకటించే ప్రాథమిక జాబితాలో పేరు లేనిచో మళ్ళి దరఖాస్తు సమర్పిస్తే అర్హతను పరిశీలించి రేషన్ కార్డు మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి ఎస్పీ అశోక్ కుమార్, ఏఎస్పీ భీమ్ కుమార్, ఆర్డీవో మధు సుధను, డీఆర్డీఓ రఘు వరుణ్, డిపిఓ, మధన్ మోహన్, ఎమ్మార్వో, కృష్ణ చైతన్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.