- కొత్తగా 12,769 సెంటర్లు
- మహిళకు నిర్వహణ బాధ్యతలు
Mee Seva Centers: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పింది. వీరి కోసం ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తున్నది. దీంతోపాటు ఆర్థికాభివృద్ధి కోసం వ్యాపారాల నిర్వహణకు తోడ్పాటును అందిస్తున్నది. వివిధ ప్రభుత్వ పథకాల్లోనూ భాగస్వాములను చేస్తున్నది. ధాన్యం కొనుగోళ్లు వంటివి చేపట్టడం ద్వారా మహిళా సంఘాలు ఆర్థిక పరిపుష్టిని సాధిస్తున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వీరికి మీసేవా నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది.
ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందాలన్నా, ఇతర ఏ అవసరమైనా ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే మారుమూల గ్రామాల్లో మీ సేవా కేంద్రాలు అందుబాటులో లేక ప్రజలు సమీప గ్రామాలకు వెళ్లి ఆన్‌లైన్ అప్లై వంటి పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఇకపై ఇలాంటి ఇబ్బందులు దూరం కానున్నాయి. ప్రతి గ్రామపంచాయతీలో మీసేవా కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించనున్నది.
మహిళా శక్తి పథకంలో భాగంగా మీ సేవా కేంద్రాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు గ్రామాల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది. వివిధ ఆన్‌లైన్ అప్లికేషన్లు, దరఖాస్తులు, ఆధార్ సేవలు వీటి ద్వారా పొందవచ్చు. ప్రస్తుతం రాష్ర్ట వ్యాప్తంగా 4500లకు పైగా మీ సేవ కేంద్రాలు పనిచేస్తున్నాయి. కొత్తగా ప్రభుత్వం 12,769 గ్రామపంచాయతీల్లో మీ సేవా కేంద్రాలు అందుబాటులోకి తీసుకురానున్నది.
ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి?
2024 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పించింది.
ఎవరు ఏర్పాటు చేస్తారు?
ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది.
ప్రభుత్వం ఏమైనా రుణం మంజూరు చేస్తుందా?
మీ సేవా కేంద్రం స్థాపనకు ప్రభుత్వం రూ.2.50 లక్షల రుణాన్ని స్ర్తీనిధి ద్వారా మంజూరు చేస్తుంది.
సామగ్రి ఎవరు ఇస్తారు?
ప్రభుత్వం మంజూరు చేసిన రుణంతో సంబంధిత మహిళా సంఘాల వారే కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, బయోమెట్రిక్ డివైస్, ఇంటర్నెట్ రూటర్లు, ఫర్నిచర్, ఇతర సామగ్రి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
రుణం తిరిగి చెల్లించాలా?
ప్రభుత్వం మంజూరు చేసిన రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. నెలవారి వాయిదా పద్ధతిలో రుణం మొత్తం తీరే వరకు చెల్లించాలి.
ఎక్కడ ఏర్పాటు చేయాలి?
ప్రభుత్వం ఇందుకు సంబంధించి నిర్దష్టమైన సూచనలు చేసింది. అక్కడ మాత్రమే ఏర్పాటు చేయాలి. గ్రామపంచాయతీ కార్యాలయాల్లోనే ఏర్పాటు చేయాలి.
శిక్షణ ఇస్తారా?
మహిళా సంఘాల నుంచి ఎంపిక చేసిన మహిళలకు శిక్షణ ఇస్తారు. నిర్దిష్ట కాలపరిమితితో ప్రజలకు అందించే అన్ని రకాల సేవలపై అవగాహన కల్పిస్తారు. సందేహాల నివృత్తికి టెక్నిషియన్లను అందుబాటులో ఉంచనున్నారు. ప్రధానంగా ఇంటర్ పూర్తి చేసి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. వీరిని ఆపరేటర్‌గా నియమిస్తారు. అంతకుముందే నెల రోజులు వీరికి శిక్షణ అందించి పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు.
ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి?
మహిళలు ఆర్థికంగా స్థిరపడడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడం.