- విశ్వవిజేతగా నిలిచిన ఇండియా
- ఫైనల్లో సౌతాఫ్రికాపై ఉత్కంఠ విజయం
- 17 ఏళ్ల కల సాకారం
- రోహిత్ సేన సమష్టి పోరు
- 76 పరుగులతో ఆదుకున్న కొహ్లీ
- చివరి ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ వేసిన బుమ్రా, అర్షదీప్, పాండ్యా
- రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కొహ్లీ
T 20 World Cup 2024 Champion India: ఉద్విగ్నం.. ఉద్వేగం.. ఉత్కంఠ భరిత క్షణాలివి.. 140 కోట్ల మంది భారతీయుల హృదయాలు ఉప్పొంగిపోయిన క్షణాలివి.. 17 ఏళ్ల కల సాకారమైన మధురమైన క్షణాలివి.. టీ-20 వరల్డ్ కప్‌లో అజేయ యాత్ర కొనసాగించిన భారత్ ఫైనల్లో చిరస్మరణీయ విజయంతో విశ్వవిజేతగా నిలిచింది. రోహిత్ సేన వీరోచిత పోరాట పటిమ కనబరిచి కొత్త చరిత్ర లిఖించారు. అఖండ విజయంతో భారతావణి పులకించిపోయింది.
టీ-20 వరల్డ్ కప్‌లో భాగంగా ఫైనల్లో సౌతాఫ్రికాతో తలపడిన భారత సేన 7 పరుగుల తేడాతో విక్టరీ సాధించి వరల్డ్ కప్‌ను ముద్దాడింది. మ్యాచ్ చేజారిపోతుందనుకున్న దశలో రోహిత్ సమయోచిత నిర్ణయాలు ఫలించాయి. బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో విజయం వరించింది. చివరి మూడు ఓవర్లు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టేలా చేసింది. 18 బాల్స్‌లో 22 పరుగులు చేయాల్సిన దశలో అందరూ మ్యాచ్‌పై ఆశలు వదులుకున్నారు. 18వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం రెండు పరుగుల మాత్రమే ఇచ్చి జాన్సన్‌ను బౌల్డ్ చేశాడు. 19వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన అర్షదీప్ వికెట్లు తీయకపోయినా కట్టుదిట్టమైన బంతులు విసరడంతో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చారు. దీంతో చివరి ఓవర్లో సమీకరణలు 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. 20 ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. మొదటి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి మిల్లర్ బౌండరీ లైన్‌పై సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. రెండో బంతికి రబాడా ఫోర్ కొట్టాడు. మూడో బంతికి రబాడా సింగిల్ తీసాడు. నాలుగో బంతికి మహారాజ సింగిల్ తీయడంతో భారత్ విజయం కన్ఫామ్ అయ్యింది. ఐదో బంతికి వైడ్, తరువా వేసిన బంతికి రబాడా క్యాచ్ ఔట్ అయ్యాడు. చివరి బంతి సింగిల్ తీయడంతో భారత్ 7 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది.
చిరస్మరణీయ విజయాన్ని అందుకోవడంతో భారత ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆనందంతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ప్రతి ఒక్కరి కళ్లు చెమ్మగిల్లాయి. జాతీయ జెండాలతో స్టేడియంలో చెక్కర్లు కొట్టారు. స్టెప్పులు వేసి సంబురాలు చేసుకున్నారు. రోహిత్ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
అర్ధరాత్రి పండుగ వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. జాతీయ జెండాలతో ఆనందాన్ని పంచుకున్నారు. తనకు ఇదే చివరి మ్యాచ్ అంటూ విరాట్ కొహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం ఒకింత బాధకు గురిచేసింది. మొత్తంగా భారత్‌కు ఇది రెండో టీ-20 వరల్డ్ కప్.