MP Vamsi Krishna: ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి మేరకు రూ.100 కోట్లతో ఎన్ హెచ్ 63 రోడ్డు విస్తరణ, కొత్త రోడ్డు నిర్మాణ పనులను కేంద్రం మంజూరు చేసిందని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే, శాలువాతో సన్మించారు. ఈ సందర్భంగా పలు జాతీయ రహదారుల విషయమై గడ్కరీతో చర్చించారు. అనంతరం వివేక్ మాట్లాడుతూ ఎన్‌హెచ్-63 రోడ్డు విస్తరణ, కొత్త రోడ్లను మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. మరో 15 రోజుల్లో రూ.కోటీ 80 లక్షలతో మరమ్మతు పనులు ప్రారంభమవుతాయన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని పలు రహదారుల సమస్యలపై చర్చించామన్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.