Sunny in Delhi: భానుడు రోజు రోజుకూ ఉగ్రరూపం దాల్చుతున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉష్ణతాపానికి ఢిల్లీవాసులు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రలు అమాంతం పెరిగిపోయాయి. రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం మునుపెన్నడూ లేనివిధంగా 52.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రతలు కావడం గమనార్హం. మంగళవారం 49.9 డిగ్రీలు నమోదైంది. ఒక్క రోజులోనే అమాంతం పెరగడంతో ఢిల్లీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు.
దీంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. 8,302 మెగావాట్లకు విద్యుత్ వినియోగం చేరినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ వినియోగం ఇంత భారీగా పెరగడం సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో 50 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలోని పార్కింగ్ స్థలంలో అర్ధరాత్రి దాటిన తరువాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించడంతో పార్క్ చేసిన 17 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. తొమ్మిది అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పివేశాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తూర్పు ఢిల్లీ మండవాలి పోలీసు స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఒంటి గంట సమయంలో వాహనాల పార్కింగ్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పార్కింగ్ చేసిన వాహనాలు మంటల్లో చిక్కుకోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఘటనపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వేసవి కారణంగానే ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు.