- ట్రావిస్ హెడ్ సెంచరీ
- క్లాసెన్ హాఫ్ సెంచరీ
- ఆర్సీబీతో మ్యాచ్‌లో భారీ స్కోర్
- ఎస్ఆర్‌హెచ్ రికార్డు స్కోరు 287
- ఐపీఎల్‌లో ఇదే అత్యధికం
SRH vs RCB, IPL 2024: బెంగళూరులో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిసింది.. పరుగుల వరద పారింది. హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 287 పరుగులు చేసింది. కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఐపీఎల్ 2024 సీజన్ 30వ మ్యాచ్ బెంగళూరు చినస్వామి స్టేడియంలో సోమవారం ఆర్సీబీ, హైదరాబాద్ తలపడ్డాయి. టాస్ గెలిచిన బెంగళూరు ఎస్ఆర్‌హెచ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆది నుంచే దూకుడుగా ఆడిన ఎస్ఆర్‌హెచ్ భారీ స్కోరు నమోదు చేసింది. ట్రావెన్ హెడ్, అభిషేక్ శర్మ మొదటి వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 165 పరుగుల వద్ద హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయింది.
హెడ్ 102 పరుగులు చేసి ఔట్ అయ్యారు. 41 బాల్స్‌లో 8 సిక్సులు, 9 ఫోర్లతో చెలరేగిపోయాడు. ఆకాశమే హద్దుగా ఆడాడు. భారీ షాట్లతో ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోసాడు. ఏ బౌలర్‌ను లెక్క చేయకుండా సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో కేవలం 15 ఓవర్లలోనే హైదరాబాద్ 205 పరుగులకు చేరుకుంది. హెడ్ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన మార్కక్రమ్, క్లాసెన్ ధాటిగా ఆడారు. 16 ఓవర్లలోనే 217 పరుగులకు చేరుకుంది. క్లాసెన్ 67 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఏకంగా 7 సిక్సులు బాదాడు. 17 ఓవర్లలోనే 231 పరుగులు చేరుకున్నది. 19 ఓవర్లలో 266 పరుగులకు చేరుకుంది.
చివర్లలో మార్క్‌క్రమ్, అబ్దుల్ సమద్ రెచ్చిపోయి ఆడారు. సమద్ కేవలం 10 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి. మార్క్‌క్రమ్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. ఇందులో 22 సిక్సులు, 19 ఫోర్లు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.