England players leaving IPL: ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి దూరం కానున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికే అన్ని జట్లు 12 మ్యాచులు ఆడగా.. ఇంకా కొన్ని జట్లు రెండు మ్యాచులు, కొన్ని జట్లు ఒక్కో మ్యాచ్ ఆడనున్నాయి. అయితే కోట్లు కుమ్మరించి కొనుకున్న ఆటగాళ్లు ఆయా జట్లను విడిచి వెళుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఆ జట్టును విడిచి వెళ్లాడు. ఇంగ్లాండ్ పాకిస్థాన్‌తో 3 మ్యాచ్‌ల టీ 20 సిరీస్ ఆడనుంది.
జోస్ బట్లర్ ఇంగ్లాండ్ టీ 20 క్రికెట్ టీంకు కెప్టెన్ కావడంతో వెంటనే వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆర్సీబీకి ఆడుతున్న విల్ జాక్స్, రోస్ టాప్లీ, చెన్నై జట్టులోని మొయిన్ అలీ, పంజాబ్ టీంలోని సామ్ కర్రన్, లివింగ్ స్టోన్, జానీ బెయిర్ స్టో లాంటి ఆటగాళ్లు ప్రాంచైజీలను వీడి జాతీయ జట్టులో చేరనున్నారు. విల్ జాక్స్ లాంటి ప్లేయర్ లేకపోవడం ప్లే ఆఫ్ రేసులో ఉండాలనుకుంటున్న ఆర్సీబీకి పెద్ద ఎదురుదెబ్బ లాంటిది.
శిఖర్ ధావన్ గాయపడటంతో ఆ స్థానంలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సామ్ కర్రన్ కూడా వెళ్లిపోవడం పంజాబ్ జట్టుకు మింగుడు పడని విషయం. ఇప్పటికే పంజాబ్ పాయింట్స్ టేబుల్స్‌లో చివరి స్థానంలో ఉండగా.. సామ్ కరన్, లివింగ్ స్టోన్ లాంటి విధ్వంసకర బ్యాటర్ టీంను వీడడంతో మిగతా రెండు మ్యాచులు కూడా గెలవడం కష్టమే.
జూన్ 2 నుంచి ఆరంభం కాబోయే టీ 20 వరల్డ్ కప్ కోసం అన్ని జట్లు ప్రిపేర్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతి జట్టును ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించేసింది. కొన్ని టీంలు అమెరికా బయల్దేరి వెళ్లిపోయాయి. అక్కడి వాతావరణానికి అలవాటుపడటానికి.. అక్కడి పిచ్‌లపై ఆడాలంటే కనీసం నెలరోజులైనా ముందు వెళ్లాలి. కానీ ఇండియాలో ఐపీఎల్ జరుగుతుండంతో మన ఇండియా క్రికెట్ టీం ప్లేయర్లందరూ ఇంకా భారత్‌లోనే ఉన్నారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే అందరూ అమెరికా ఫ్లైట్ ఎక్కబోతున్నారు.