Mitchell Starc: మిచెల్ స్టార్క్ ఆసీస్ స్టార్ బౌలర్. ఐపీఎల్ సీజన్లలో ఎక్కువగా కనిపించని ఈ పేసర్. 2023 ఆసీస్ వరల్డ్ కప్ గెలవగానే ఐపీఎల్ ఆడతానని ప్రకటించాడు. దీంతో ఈ ఐపీఎల్‌లో మిచెల్ స్టార్క్‌ను కచ్చితంగా ఏదో జట్టు తీసుకుంటుందని అందరూ అనుకున్నారు. ఐపీఎల్ వేలంలో మిచెల్ స్టార్క్ వంతు రాగానే ఒకరిని మించి మరొకరు మిచెల్ స్టార్క్ కోసం ఎగబడ్డారు.
అప్పటికే మరో ఆసీస్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్‌ను రూ.20.50 కోట్లు పెట్టి సన్ రైజర్స్ కొనుక్కుంది. ఇదే ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ అంటే మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.26.50 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఎక్కువ ధరలకు అమ్ముడుపోయిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ మిచెల్ స్టార్క్‌పై నమ్మకముంచింది.
కానీ మిచెల్ స్టార్క్ కోల్‌కతా తరఫున మొదటి 9 మ్యాచుల్లో కేవలం 7 వికెట్లు మాత్రమే తీసి ఉసూరుమినిపించారు. అందరూ మిచెల్ స్టార్క్‌ను తీవ్రంగా విమర్శించారు. అంత డబ్బు అవసరం లేదని, మిచెల్ స్టార్క్‌కు అంత సీన్ లేదని ఎద్దేవా చేశారు. ఈ విమర్శలనే తన అస్త్రాలుగా ఉపయోగించుకుని స్టార్క్ ప్లేఆప్స్, ఫైనల్‌లో తీవ్ర ఒత్తిడి ఉన్న మ్యాచుల్లో అయిదు వికెట్లు తీసి కోల్ కతా గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
ప్లే ఆఫ్స్‌లో ట్రావిస్ హెడ్‌ను బౌల్డ్ చేసి కోల్‌కతాకు శుభారంభం అందించాడు. ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, ఫామ్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠిని ఔట్ చేసి మ్యాచ్ ను కోల్ కతా వైపు తిప్పాడు. దీంతో మిచెల్ స్టార్క్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఏదో సినిమాలో డైలాగ్ చెప్పినట్లు క్లాస్ రూంలో ఎవరైనా ఆన్సర్ చెబుతారు. కానీ పరీక్షల్లో సరిగా రాసిన వారే పాస్ అవుతారనేలా.. లీగ్ మ్యాచుల్లో ఎవరైనా వికెట్లు తీస్తారు. కానీ నాకౌట్ గేమ్స్‌లో ప్రత్యర్థి టీంలను ఒత్తిడిలోకి నెట్టేలా ఆరంభంలోనే వికెట్లు తీసి మ్యాచ్‌ను తమ జట్టు వైపు తిప్పడంలో మిచెల్ స్టార్క్ సక్సెస్ అయ్యాడు. దీంతో తీవ్ర ఒత్తిడి ఉన్న మ్యాచుల్లో ఆడిన వారే అసలైన ఆటగాడని నిరూపించాడు.