- రోహిత్ తీరుపై కపిల్ కామెంట్స్
- బుమ్రాతో మూడో ఓవర్ వేయిస్తారా?
- మాజీ ప్రపంచ కప్ విజేత అసహనం
Kapil dev: పాకిస్థాన్, ఇండియా మ్యాచ్‌పై మాజీ ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. ఆదివారం ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో స్వల్ప తేడాతో ఇండియా విజయాన్ని నమోదు చేసుకున్నది. కేవలం 119 పరుగులు చేసిన ఇండియా స్వల్ప స్కోరుకును కాపాడుకోవడంలో సఫలీకృతమైంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా నాలుగు ఓవర్లు వేసి 14 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాలపై కపిల్ దేవ్ పలు ప్రశ్నలు సంధించారు. రోహిత్ శర్మ(Rohit Sharma) కప్టెన్సీపై అసంతృప్తిని వెళ్లగక్కాడు.
రోహిత్ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని ఉంటే మ్యాచ్ స్వరూపం మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. తీవ్ర ఉత్కంఠకు దారి తీసే పరిస్థితులు తలెత్తేవి కావని అభిప్రాయపడ్డారు. బాల్ బాల్‌కు ఏం జరుగుతుందో అన్న పరిస్థితి ఉండేది కాదని పెదవి విరిచారు. గ్రౌండ్‌లోని జట్టు సభ్యులు సైతం మ్యాచ్ తీరును పసిగట్టలేనంత నిస్సహాయ స్థితిలో ఉండేవారు కాదని పేర్కొన్నారు. పిచ్ స్వరూపాన్ని బట్టి బౌలింగ్ ఆప్షన్లు యూజ్ చేసుకోడంలో రోహిత్ విఫలమైనట్లు స్పష్టం చేశారు.
వికెట్ టేకింగ్ బౌలర్ బుమ్రా (Bumrah)ను మూడో ఓవర్‌లో పరిచయం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుమ్రాతో ఫస్ట్ ఓవర్ వేయిస్తే ఇంతకంటే మెరుగైన ఫలితాన్ని సాధించి ఉండేవారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బుమ్రాను ఐదో లేదా ఆరో బౌలర్‌గా బౌలింగ్ చేయిస్తే విజయం సాధించడం కష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం మీరు ఆడుతున్నది టెస్ట్ మ్యాచ్ కాదని, టీ-20 అని గుర్తుంచుకోవాలని సూచించారు. ఎంత త్వరగా వికెట్లు తీయగలిగితే అంత త్వరగా మ్యాచ్‌పై పై చేయి సాధించే వీలుంటుందని అన్నారు. వికెట్లు త్వరగా తీయడం ద్వారా ప్రత్యర్థి జట్టుపై ఒత్తి పెంచొచ్చని వెల్లడించారు.
బుమ్రా ఆటతీరును కపిల్ ప్రశంసించారు. అతను ఇంత క్రికెట్ ఆడగలడని అనుకోలేదని, అతని బౌలింగ్ యాక్షన్, రిథమ్, కదలికలు విభిన్నంగా ఉంటాయని తెలిపారు. ఈ రకమైన బౌలింగ్ యాక్షన్‌తో భుజాలపై ఒత్తిడి తెస్తుందని, కానీ మా అందరి అంచనాలు తప్పని నిరూపించాడని అన్నారు.
మరోవైపు పాకిస్థాన్ పరుగుల వేటలో గవాస్కర్ రోహిత్ బౌలింగ్ వ్యూహంపై పలు వ్యాఖ్యలు చేశారు. జస్ప్రీత్ బుమ్రాను ఛేజింగ్‌లో మూడో ఓవర్ వరకు బౌలింగ్‌కు తీసుకురాకపోవడం సరైన నిర్ణయం కాదన్నారు. పాకిస్థాన్ ఓపెనర్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్‌ల వికెట్లు త్వరగా తీస్తే మిడిల్ ఆర్డర్‌పై తీవ్ర ఒత్తిడి ఉండేదని అన్నారు. బుమ్రాకు మొదటి ఓవర్ ఇవ్వాల్సిందని, మూడో ఓవర్ కాదని స్పష్టం చేశారు. వికెట్ టేకింగ్ బౌలర్‌తో వేచి ఉంచే ధోరణి సరికాదని అభిప్రాయపడ్డారు. ఆటలో వికెట్లు తీయడమే ముఖ్యమని వెల్లడించారు.