- లక్నో ఘన విజయం
- భారీ లక్ష్యం అలవోకగా ఛేదన
- సెంచరీతో చెలరేగిన స్టొయినీస్
- మూడు బంతులు మిగిలి ఉండగానే గెలుపు బావుట
- గైక్వాడ్ సెంచరీ వృథా
- చెన్నైపై ఆరు వికెట్ల తేడాతో విక్టరీ
CSK vs LSG, IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో ఘన విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. చెన్నై విధించిన 211 పరుగుల లక్ష్యాన్ని మూడు బంతులు మిగిలి ఉండగానే చేరుకుంది. లక్నో బ్యాటర్ మార్కస్ స్టొయినీస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 124 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. చెన్నై బ్యాటర్లు గైక్వాడ్ సెంచరీ, దూబే అర్ధ సెంచరీ చేసినా విక్టరీ అందుకోలేకపోయింది. భారీ స్కోరును చెన్నై నిలబెట్టుకోలేకపోయింది. చెన్నైపై లక్నో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హోం గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు.
ఐపీఎల్ 2024 సీజన్ 39వ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబర్ స్టేడియంలో మంగళవారం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ గేంట్స్ తలపడ్డాయి. లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీతో అదరగొట్టాడు. మూడు సిక్సులు, 12 ఫోర్ల సాయంతో కేవలం 60 బంతుల్లోనే 108 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శివం దూబే అర్ధ సెంచరీతో అలరించాడు. 27 బాల్స్‌లో 66 పరుగులు చేసాడు. దూబే ఏకంగా ఏడు సిక్సులు బాదాడు. మూడు ఫోర్లు కూడా కొట్టాడు. రహానే(1), మిచెల్ (11), రవీంద్ర జడేజా (16) తక్కువ స్కోరుకే ఔట్ అయ్యారు. లక్నో బౌలర్లలో హెన్రీ, మోసిన్ ఖాన్, యష్ ఠాకూర్ చెరో వికెట్ తీసుకున్నారు.
ధోనీ మేనియా
11.5 ఓవర్లలో రవీంద్ర జడేజా 16 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన శివం దూబే, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చివరి వరకు నిలబడి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కిలక పాత్ర పోషించారు. గైక్వాడ్ సెంచరీ, దూబే అర్ధ సెంచరీలతో రాణించారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసారు. 19.4 ఓవర్లలో దూబే రనౌట్‌గా వెనుదిరిగాడు. దూబే ఈ మ్యాచ్‌లో వెయ్యి పరుగుల మైలురాయిని అధిగమించాడు. చివరి రెండు బంతులు మిగిలి ఉండగా ధోనీ బ్యాటింగ్‌కు వచ్చాడు. ధోనీ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. 19.4 ఓవర్‌లో బ్యాటింగ్ ఎండ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ సింగిల్ తీసి ధోనీకి బ్యాటింగ్ ఇచ్చారు. చివరి ఒక్క బంతి ఆడిన ధోనీ దాన్ని ఫోర్‌గా మలిచాడు. ధోనీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్టేడియం హెరెత్తింది. ధోనీ నామస్మరణతో మార్మోగింది.
తరువాత 211 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన లక్నో ధాటిగా ఆడే ప్రయత్నంలో మొదటి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. డికాక్ డకౌట్‌గా వెనుదిరిగాడు. 33 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ 16 పరుగులుచేసి ముస్తిఫిజర్ బౌలింగ్‌లో రుతురాజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. స్టొయినీస్, దేవదత్ పడిక్కల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసారు. స్టొయినీస్ 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ మార్క్ దాటాడు. 10.6 ఓవర్లలో లక్నో మూడో వికెట్ కోల్పోయింది. పడిక్కల్ 13(19) పతిరాణా బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. పూరన్ రెండు సిక్సులు, మూడు ఫోర్లు బాది 34(15) పరుగులు చేసి నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. స్టొయినీస్ వీరోచిత పోరాటం చేసాడు. సెంచరీతో చెలరేగిపోయాడు. 63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సులతో 124 పరుగులు చేసాడు. దీపక్ హుడా ఒక సిక్సర్ రెండు ఫోర్లతో 17 పరుగులు చేసాడు. చెన్నై బౌలర్లు పతిరాణ 2 వికెట్లు, దీపక్ చాహర్, ముస్తాఫిజర్ చెరో వికెట్ తీసారు.