- పార్లమెంటు ఎన్నికల బరిలో వనితలు
- ఉద్ధండులతో తలపడుతున్న మహిళలు
- ఆయా సెగ్మెంట్లలో ఒంటరి పోరు
- మహిళల మనసు గెలిచి నిలిచేనా?
Parliament Elections 2024: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన వనితలు.. ప్రస్తుతం అన్ని రంగాల్లో దూసుకపోతున్నారు. ఈ క్రమంలో రాజకీయ రంగంలో తీసుకొచ్చిన రిజర్వేషన్ల కారణంగా మహిళలు సైతం పరిపాలన కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో ఒకరిద్దరు మహిళలు మాత్రమే కనిపించేవారు. కానీ ప్రస్తుతం రాజకీయం కొత్త పుంతలు తొక్కుతున్నది. ఈ క్రమంలో ఆయా పార్టీల నుంచి మహిళలు బరిలో నిలుస్తున్నారు. పురుషులతో సమానంగా పోటీ పడుతూ విజయఢంకా మోగిస్తున్నారు. ఈ సారి పార్లమెంటు ఎన్నికల్లో సైతం మహిళలు రాజకీయ ఉద్ధండులతో తలపడుతున్నారు. ఆయా సెగ్మెంట్లలో ఒంటరిగానే బరిలో నిలుస్తూ పురుషులకు సవాల్ విసురుతున్నారు. మరి వారు రాజకీయ చదరంగంలో చక్రం తిప్పుతారా? లేక చతికిలపడతారా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది.
పార్లమెంటు బరిలో మగువలు
తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలున్నాయి. అన్ని స్థానాలు జనరల్, రిజర్వ్ కేటగిరీలే. ఇందులో మహిళల కోసం ప్రత్యేకంగా ఫలానా సెగ్మెంట్ అంటూ లేదు. ఈ క్రమంలో ఆయా పార్టీలు పురుషులతో పాటు మహిళలకూ పార్లమెంటు సీట్లు కేటాయించాయి. ఆయా సెగ్మెంట్లలో రాజకీయ ఉద్ధండులున్నా.. వారిని ఢీకొనేందుకు రంగంలో దిగారు. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ ముగ్గురిని, భారతీయ జనతా పార్టీ ఇద్దరిని, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఒకరిని బరిలో నిలిపింది.
ఆదిలాబాద్ నుంచి మొదటి మహిళ..
ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఇప్పటి వరకు మహిళా అభ్యర్థి బరిలో నిలువలేదు. మొదటిసారి ఆదిలాబాద్ (ఎస్టీ) స్థానం నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ ఆత్రం సుగుణకు టికెట్ కేటాయించింది. ఆమెను ఎలాగైనా గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో పావులు కదుపుతున్నది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరఫున ఆత్రం సక్కు, బీజేపీ నుంచి మాజీ ఎంపీ గొడెం నగేశ్ బరిలో ఉన్నారు. మరి వీరి ఇద్దరిని తట్టుకొని గెలుపు వాకిట సుగుణ నిలుస్తుందో లేదో చూడాల్సిందే.
మల్కాజిగిరి నుంచి జడ్పీ చైర్ పర్సన్..
మల్కాజిగిరి నుంచి ఈసారి రసవత్తర పోరు సాగనున్నది. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున ఈటల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బరిలో నిలిచారు. వీరిని ఢీకొనేందుకు కాంగ్రెస్ పార్టీ జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డిని రంగంలోకి దింపింది. ముక్కోణపు పోరులో మహిళ ఏ మేరకు విజయం సాధిస్తుందో లేక రాజకీయ ఉద్ధండులు గెలుస్తారో వేచిచూద్దాం.
కంచుకోట బద్దలవుతుందా?
హైదరాబాద్.. ఈ స్థానం నుంచి ఎంపీ ఎవరంటే ఠక్కున వచ్చే సమాధానం అసదుద్దీన్ ఓవైసీ. ఈ సెగ్మెంట్ మజ్లిస్ పార్టీకి కంచుకోటగా నిలుస్తున్నది. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓవైసీదే విజయం. ఈయనకు ఈసారి చెక్ పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ ఆధ్యాత్మిక వేత్తగా పేరున్న మాధవీ లతను బరిలో దించింది. ఇన్నాళ్లు హిందువులపై మజ్లిస్ సాగించిన ఆగడాలను ఉటంకిస్తూ ప్రచారంలో దూసుకపోతున్నారు మాధవీ లత. ఈ సారి హైదరాబాద్ సీటును చేజిక్కించుకొని మజ్లిస్ కంచుకోటను బద్దలు కొట్టాలనే తలంపుతో ముందుకుసాగుతున్నది. చూడాలి మరి.. ఈసారైనా ఎంఐఎం కంచుకోట బద్దలవుతుందో లేదో..
పాలమూరులో కమలం వికసించేనా?
పాలమూరు బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిని మాజీ మంత్రి, బీజేపీ మహిళ నేత డీకే అరుణ ఢీకొననున్నారు. ఈసారి ఎలాగైనా పాలమూరులో కమలం వికసించేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలపై విమర్శనాస్ర్తాలు సంధిస్తూ ముందుకుసాగుతున్నారు.
అటు నుంచి కాదని.. ఇటు నుంచి..
వరంగల్ (ఎస్సీ) స్థానం నుంచి మొదట బీఆర్ఎస్ పార్టీ కడియం కావ్యను బరిలో దించేందుకు సిద్ధమైంది. ఆమెకు టికెట్ సైతం కన్ఫామ్ చేసింది. కానీ ప్రతిపక్ష పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుపు సులువు కాదని, రాజకీయ స్వలాభం కోసం ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మారారు. దీనికితోడు ఆమె కూతురుకు అధికార పార్టీ టికెట్ సైతం ఇప్పించుకున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆరూరి రమేశ్ బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ సైతం సిట్టింగ్ జడ్పీటీసీకి టికెట్ కేటాయించింది. మరి వీరిని తట్టుకొని కడియం కావ్య ఏ మేరకు గెలుపు గుమ్మం తడతారో?
మరోసారి అదృష్టం వరించేనా..?
మహబూబాబాద్ లోక్సభ బరిలో మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత బరిలో నిలిచారు. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సీతారాం నాయక్, కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ బరిలో ఉన్నారు. కాగా, మాలోత్ కవిత ఇక్కడ సిట్టింగ్ ఎంపీ కావడంతో మరోసారి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు సైతం ప్రచారంలో దూసుకుపోతున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారో మరికొన్ని రోజులు వేచిచూద్దాం.
మహిళలు మద్దతు పలికేనా?
తెలంగాణ నుంచి ఆరుగురు మహిళలు ఆయా పార్టీల తరఫున బరిలో నిలిచారు. వారు రాజకీయ ఉద్ధండులుగా పేరున్న నేతలతో తలపడుతున్నారు. మరి వీరికి ఆయా నియోజకవర్గాల పరిధిలోని మహిళా ఓటర్లు ఏ మేరకు సహకరిస్తారన్నదే ప్రశ్న. ఆయా సెగ్మెంట్ల పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళల ఓట్లు అధికంగా ఉన్నాయి. వీరు మహిళలకు మద్దతిస్తే గెలుపు సునాయసమవుతుంది. వీరిలో ఎంత మంది పార్లమెంట్ గుమ్మం తొక్కతారు? ఎంత మంది ఓటమి పాలవుతారో? ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.