ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రాంగణంలో యోగా కేంద్రం ప్రారంభం
Yoga: నిర్మల్, నవంబర్ 26 (మన బలగం): ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మంగళవారం స్థానిక జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగా శిక్షణ కేంద్రాన్ని వైద్యశాఖ అధికారులతో కలిసి మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో యోగాను భాగం చేసుకొని ఆరోగ్యంగా జీవించాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యోగా కేంద్రంలో యోగా నిపుణులచే శిక్షణను అందివ్వనున్నట్లు తెలిపారు. యోగాతో మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని యోగా సాధన చేయాలన్నారు. నిత్యం యోగా సాధనతో ఎన్నో రకాలైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని, రోగ నిరోధక శక్తి అధికమవుతుందని తెలిపారు. యోగా శిక్షణ కేంద్రానికి అనుబంధంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 10 యోగా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రజలందరికీ యోగా చేరువయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రాజేందర్, ఆస్పత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, ఆర్ఎంవో సుమలత, ఆయుష్ విభాగపు వైద్యాధికారి గంగాదాస్, డీసీహెచ్ డాక్టర్ సురేశ్, తహసీల్దార్ రాజు, అధికారులు, వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.