Gurukula Vidyalaya: మనబలగం, సిరిసిల్ల ప్రతినిధి: విద్యార్థులు అన్నిరకాల పరీక్షల్లో రాణించేలా సిద్ధం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా టీచర్లను ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధి చిన్న బోనాలలోని గురుకుల విద్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, విద్యాలయం ఆవరణ, కిచెన్ గది, కూరగాయలు, బియ్యం, కోడిగుడ్లు, పండ్ల నాణ్యతను పరిశీలించారు. విద్యాలయం ఆవరణ స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారు? అని ఆరా తీశారు. మొత్తం 548 మంది విద్యార్థులు చదువుతున్నారని ప్రిన్సిపాల్ థెరిసా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం విద్యార్థులను మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అంశాల్లో ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు. విద్యాలయం టీచర్లు పాల్గొన్నారు.