Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay: పోలీసులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో ప్రత్యేక శిక్షణ అనివార్యం: బెంగళూరులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

  • సమాచార వ్యవస్థను బలోపేతం చేయడంలో డీసీపీడబ్ల్యూ పనితీరు భేష్
  • కర్నాటకలోని డీసీపీడబ్ల్యూ సెంటర్ లో కొత్త హాస్టల్ బ్లాకు నిర్మాణానికి శంకుస్థాపన

Bandi Sanjay : మనబలగం, తెలంగాణ బ్యూరో:సమాచార వ్యవస్థను బలోపేతం చేయడంలో డైరెక్టరేట్ ఆఫ్ కోఆర్డినేషన్ పోలీస్ వైర్ లెస్ డీసీపీడబ్ల్యూ విభాగం అందిస్తున్న సేవలు అభినందనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇకపై ప్రాంతీయ పోలీస్ వైర్ లెస్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చెయిన్, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కర్నాటకలోని బెంగళూరు విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ డైరెక్టరేట్ ఆఫ్ కోఆర్డినేషన్ పోలీస్ వైర్ లెస్ సెంటర్ లోని ప్రాంతీయ పోలీస్ వైర్‌లెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కొత్త హాస్టల్ బ్లాక్ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంజయ్ తోపాటు దక్షిణ బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య, డీసీపీఎం అదనపు డైరెక్టర్ ఆర్కే వర్మ తోపాటు హోంశాఖ ఉన్నాధికారులు, కేంద్ర భద్రతా దళాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘బెంగళూరులోని సమన్వయ డైరెక్టరేట్ పోలీస్ వైర్ లెస్, గృహ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రాంతీయ పోలీస్ వైర్‌లెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కొత్త విద్యార్థి హాస్టల్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉంది. 1964లో నెలకొల్పిన డైరెక్టరేట్ ఆఫ్ కోఆర్డినేషన్ పోలీస్ వైర్ లెస్ విభాగం హోంశాఖలో ముఖ్యమైనది. దేశవ్యాప్తంగా పోలీస్ టెలికమ్యూనికేషన్ రంగంలో అగ్రగామిగా ఉంది.

పోలీస్, ఇతర భద్రతా, విపత్తు నియంత్రణ సంస్థల మధ్య నోడల్ ఏజెన్సీగా ఈ విభాగం సమర్థవంతంగా సేవలందిస్తోంది. లా అండ్ ఆర్డర్ సంబంధిత అత్యవసర సందేశాలను ఢిల్లీతోపాటు 33 రాష్ట్రాల రాజధానుల మధ్య అంత:రాష్ట్ర పోలీస్ వైర్ లెస్ కేంద్రాల సహాయంతో 24 గంటలూ పంపుతూ పోలీస్ కమ్యూనికేషన్ వ్యవస్థను సక్రమంగా, సమన్వయంతో ఆధునిక పద్ధతుల్లో నిర్వహిస్తుండటం అభినందనీయం’’ అని తెలిపారు. మన దేశంలో సమయానుగుణంగా కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ఎంతో అవసరమని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. దేశ భద్రతా కారణాల నిమిత్తం మారుతున్న కమ్యూనికేషన్ పరిస్ధితులకు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సమన్వయానికి, భవిష్యత్తు సవాళ్లకు తగిన విధంగా అనుకూలమైన, విశ్వసనీయమైన, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ ను కలిగి ఉండడం ప్రధానమని చెప్పారు. విజ్ఞానం, సాంకేతికత రంగం అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు కేంద్ర భద్రతా బలగాలకు, పోలీసు బలగాలకు ప్రత్యేకంగా శిక్షణ అందించడం కూడా అవసరమని చెప్పారు. గతంలో కేంద్ర,రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వివిధ ర్యాంకుల పోలీసు దూర సంచార సిబ్బందికి శిక్షణ అందించేందుకు న్యూ ఢిల్లీలోని సెంట్రల్ పోలీస్ రేడియో ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో మాత్రమే సౌకర్యాలుండేవన్నారు..

ప్రస్తుతం చండీగఢ్, బెంగళూరు, గాంధీనగర్, కొల్‌కతా ప్రాంతాల్లో ప్రాంతీయ పోలీసు రేడియో శిక్షణా సంస్థలను స్థాపించగలిగామన్నారు. ఈ క్రమంలో కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, పుదుచ్చేరి, లక్షద్వీప్ లలో పని చేసే వివిధ ర్యాంకుల పోలీసు సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో శిక్షణకు వచ్చే వారికి ఉత్తమ సౌకర్యాలు అందించేందుకు ఈ కొత్త హాస్టల్ బ్లాక్ ను నిర్మిస్తుండటం అభినందనీయమన్నారు. అయితే “పోలీసు కమ్యూనికేషన్స్” లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెంట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్‌చెయిన్, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను అందించాలని సూచించారు. సిబ్బందికి ప్రాముఖ్యతనిచ్చి, వారి టెక్నికల్ నైపుణ్యాలను పెంచేందుకు, వ్యక్తిత్వ నిర్మాణాన్ని వృద్ధి చేసేందుకు ప్రముఖ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహించే అవకాశాలను అన్వేషించాలని కేంద్ర మంత్రి కోరారు. అదేవిధంగా, శిక్షణా సంస్థలు సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లకు జాతీయ ప్రమాణాలను చేరుకునేందుకు ప్రయత్నించడంతోపాటు త్వరలోనే ఉత్తమ, అత్యుత్తమ, అద్భుతమైన ప్రమాణాలు కలిగిన సర్టిఫికెట్ పొందేలా కృషి చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *